Brij Bhushan Singh: వాహనదారులపైకి దూసుకెళ్లిన బ్రిజ్‌భూషణ్‌ తనయుడి కాన్వాయ్‌.. ఇద్దరు మృతి

భాజపా నేత బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhushan Singh) కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆయన కుమారుడు కరణ్‌ భూషణ్ సింగ్ కాన్వాయ్‌ ఇద్దరి మృతికి కారణమైంది. 

Published : 29 May 2024 14:34 IST

లఖ్‌నవూ: మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ (Brij Bhushan Singh) పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆయన తనయుడు కరణ్ భూషణ్‌ సింగ్‌ కాన్వాయ్‌లోని కారు వాహనదారులపైకి దూసుకెళ్లింది. దాంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా నగర సమీపంలోని రహదారిపై ఈ ఘటన జరిగింది. దీనిపై ఫిర్యాదు నమోదైంది.

తన కుమారుడు(17), సమీప బంధువు(24) బైక్‌పై బయటకు వెళ్లారని, అప్పుడే ఎదురుగా వచ్చిన కారు వారిని ఢీకొట్టిందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. దాంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. గాయపడిన మరొకరు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నట్లు చెప్పారు. అప్పుడు కరణ్ ఆ కాన్వాయ్‌లో ఉన్నారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. కైసర్‌గంజ్‌ నుంచి కరణ్‌ భాజపా అభ్యర్థిగా ఉన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఇరుక్కోవడంతో బ్రిజ్‌ భూషణ్‌ను పార్టీ పక్కన పెట్టింది. ఆ కేసు కారణంగా ఆయన రెండేళ్లుగా వార్తల్లో నానుతున్నారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా క్రీడా రాజకీయాలకు స్వస్తి చెప్పినట్లు ప్రకటించారు. యూపీలోని గోండా చుట్టుపక్కల అరడజను జిల్లాల్లో ఆయన హవా కనపడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కరణ్‌కు పార్టీ టికెట్‌ ఇచ్చింది. దీనిపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ దేశ ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా..? ఒక్క వ్యక్తి ముందు లొంగిపోయిందా..? అని రెజ్లర్లు ప్రశ్నించారు.

తాజాగా ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా విమర్శలు చేసింది. ‘‘తండ్రి వలే కుమారుడు కూడా. తర్వాతి తరానికి తన లక్షణాలు అందించారు. కాన్వాయ్‌తో ఢీకొట్టడం ద్వారా బ్రిజ్‌భూషణ్ కుమారుడు ఒక అడుగు ముందుకు వేశారు. నేరపూరిత ప్రవర్తనను ఈ ఘటన వెల్లడిచేస్తోంది’’ అని దుయ్యబట్టింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని