Yoga day: ప్రమాదం ఊహించరా?.. కదులుతున్న రైలుపై ‘యోగా డే’ రీల్‌ !

కదులుతున్న గూడ్సురైలుపై యోగా డే రీల్‌ చేసిన ఇద్దరు యువకుల్ని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో జరిగింది.

Published : 24 Jun 2023 01:07 IST

నోయిడా: కదులుతున్న రైళ్లకు ఎదురుగా సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో జరుగుతున్నా కొందరి ఆలోచనల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఏదైనా కొత్తగా ప్రయత్నించాలన్న ఉత్సాహంతో ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ‘యోగా డే రీల్‌’  చేసేందుకు.. కదులుతున్న గూడ్సు రైలు ఎక్కిన ఇద్దరు యువకుల్ని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో జరిగింది. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున సుమారు 19, 22 ఏళ్ల వయసున్న ఇద్దరు యువకులు నోయిడా సమీపంలోని ఓ వంతెనను గూడ్సు రైలు నెమ్మదిగా దాటుతుండగా.. దానిపై ఎక్కేశారు. రెండు బోగీల మధ్య నిల్చొని ఛాతీని చూపిస్తూ, తమ శరీర సౌష్టవాన్ని ప్రదర్శిస్తూ వీడియోకు ఫోజులిచ్చారు. ఆ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో యువకుల కోసం గాలించిన నోయిడా రైల్వే పోలీసులు వారిద్దర్నీ అరెస్టు చేశారు. నిందితులను గ్రేటర్‌ నోయిడాలోని జర్చాకు చెందిన వారిగా గుర్తించి, స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. వారిద్దరూ కాలేజీ విద్యార్థులని, సామాజిక మాధ్యమాల్లో పాపులర్‌ అయ్యేందుకే ఇలాంటి విన్యాసాలు చేశారని పోలీసులు మీడియాకు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని