- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
ఆ 2 గ్రామాలు ఆ దేశాలను ప్రతిబింబిస్తాయ్!
(ఫొటో: గూగుల్ మ్యాప్)
ఉత్తర, దక్షిణ కొరియా దేశాల గురించి అందరికీ తెలిసిందే. ప్రజాస్వామ్య దేశంగా దక్షిణ కొరియా ఆధునిక ప్రపంచంతో పోటీ పడుతూ ముందుకు సాగుతుంటే.. నియంత కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉత్తర కొరియా బానిసత్వాన్ని మోస్తోంది. ఈ రెండు దేశాలకు ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. అందుకే సరిహద్దుల్లో భారీ సైన్యాన్ని మోహరిస్తుంటాయి. ఈ సరిహద్దు మధ్యలో బఫర్ జోన్ (డీమిలిటరైజ్‌డ్ జోన్) అనే ప్రాంతం ఉంటుంది. ఇక్కడ సైన్యం ఉండదు. ఇరుదేశాలకు చెందిన నేతల సమావేశాలు, తదితర కార్యక్రమాలు ఈ ప్రాంతంలోనే జరుగుతుంటాయి. దీని గురించి అప్పుడప్పుడూ వార్తల్లో వినిపిస్తుంటుంది. కానీ, ఈ బఫర్‌జోన్‌కు సమీపంలో ఇరుదేశాల్లో ఉన్న రెండు ఆసక్తికర గ్రామాల గురించి ఎప్పుడైనా విన్నారా? ఆ రెండు గ్రామాల్లో ఒకటి ప్రత్యేక హోదా పొంది అభివృద్ధి చెందుతుంటే.. మరో గ్రామం నిర్మానుషంగా ఉన్నా అక్కడి ప్రజలు సుఖసంతోషాలు ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ గ్రామాలేవి? అక్కడ ఏం జరుగుతోంది? తెలుసుకుందాం పదండి..
1953లో కొరియా యుద్ధం ముగిసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం డిమిలిటరైజ్‌డ్ జోన్ ఏర్పాటు చేసి అక్కడ నివసిస్తున్న ప్రజల్ని ఇతర ప్రాంతాలకు తరలించారు. అయితే ఇరువైపుల ఒక గ్రామం చొప్పున నిర్మించుకునే అవకాశం కల్పించారు. దీంతో బఫర్ జోన్‌కు సమీపంలో ఇరు దేశాలు తమ దేశంలోని ప్రజల జీవనశైలి ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ఒక గ్రామాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా డయిసియాంగ్-డాంగ్ (ఫ్రీడం విలేజ్)ను.. ఉత్తరకొరియా కిజొంగ్-డాంగ్ (పీస్ విలేజ్)ను నిర్మించుకున్నాయి. వీటి గురించి పెద్దగా తెలియకపోయినా ఈ రెండు గ్రామాలు నిజంగానే ఆ దేశ పరిస్థితులను అద్దం పడుతుండటం విశేషం.
ఆంక్షలున్నా.. హాయిగా జీవిస్తున్నారు
దక్షిణ కొరియా నిర్మించిన డయిసియాంగ్-డాంగ్ గ్రామంలో ప్రస్తుతం 200 వరకు జనాభా ఉంటుంది. వీరంతా కూడా కొరియన్ యుద్ధానికంటే ముందు నుంచే నివసిస్తున్నారట. అందుకే వీరికి మాత్రమే ఈ గ్రామంలో ఉండే హక్కు ఉంది. వేరే ప్రాంతానికి చెందిన వాళ్లను ఇక్కడికి రానివ్వరు. ఆ గ్రామంతో ఇతర ప్రాంతాలకు పెద్దగా సంబంధాలుండవు. స్థానిక పన్నులు చెల్లించడానికి, సైన్యంలో సేవలు అందించడానికి ఇక్కడి ప్రజలు అనర్హులు. వీరికంటూ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఉంటాయి. ఈ గ్రామ వాసులు బయటకు వెళ్లాలంటే అనేక చెక్‌పోస్టుల్లో తనిఖీలు పూర్తయ్యాకే అనుమతిస్తారు. అయితే సూర్యాస్తమయంలోపు తిరిగి ఇంటికి వచ్చేయాలి. రాత్రి 11 గంటల తర్వాత గ్రామంలో కర్ఫ్యూ విధిస్తారు. ప్రతిక్షణం ఆ గ్రామానికి అధికార యంత్రాంగం, సైన్యం పహారా కాస్తుంటుంది. ఇన్ని ఆంక్షలున్నా.. గ్రామం లోపల ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అక్కడి ప్రజలకు వ్యవసాయమే ఆదాయ వనరు. అన్ని వసతులు ఉండటంతో చక్కగా పంటలు పండిస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. పిల్లలకు విద్య అందుతుంది. దేశపౌరులుగా ఓటు హక్కు కలిగి ఉన్నారు. అందుకే దీన్ని ‘ఫ్రీడం విలేజ్’ అని కూడా పిలుస్తుంటారు.
నిర్మానుషం.. అయినా ఆర్భాటం
ఇక ఉత్తర కొరియా విషయానికొస్తే ఆ దేశ పాలకులు తమ దేశంవైపు ఉన్న బఫర్ జోన్‌కు సమీపంలో కిజొంగ్-డాన్ పేరుతో ఓ గ్రామాన్ని నిర్మించారు. బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లు, విశాలమైన రోడ్లు, వీధి దీపాలు, విద్యుత్ సరఫరా ఇలా ఒక గ్రామానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. లేనిదల్లా ప్రజలే. ఈ గ్రామంలో ఎన్నో భవనాలు ఉన్నా.. ఒక మనిషి కూడా కనిపించడు. ఊరంతా ఖాళీగా ఉంటుంది. ఈ గ్రామాన్ని పర్యవేక్షించేందుకు కొందరు ఉద్యోగులున్నారు. ఉదయాన్నే రోడ్లను శుభ్రంగా ఊడుస్తారు. రాత్రి వేళ ఆటోమెటిక్ వ్యవస్థను ఉపయోగించి గ్రామంలోని వీధి దీపాలు, ఇళ్లలో లైట్లు వెలిగిస్తారు. దూరం నుంచి చూసేవారికి ఈ గ్రామంలో ప్రజలు నివసిస్తున్నట్లుగానే కనిపిస్తుంది. తమ దేశ ప్రజలు సంతోషంగా, గొప్పగా జీవిస్తున్నారని చెప్పే ఉద్దేశంతో ఈ విధమైన చర్యలు చేపట్టారు. దీనికి ‘పీస్ విలేజ్’ అని పేరు పెట్టారు. కానీ, ఈ గ్రామంలో మనుషులు లేరని అనేక సర్వేలు, పరిశోధకులు, నిపుణులు చెబుతున్నారు. ఇదో ‘గోస్ట్ విలేజ్’ అంటుంటారు. అయితే వారి మాటల్ని ప్రస్తుత దేశాధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ పలుమార్లు ఖండించారు. ఈ గ్రామంలో 200 కుటుంబాలు ఉన్నాయని, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఇక్కడ ఒక చైల్ట్ కేర్ సెంటర్, కిండర్‌గార్టెన్, పాఠశాలలు, ఆస్పత్రి ఉన్నాయని వెల్లడించారు. కానీ, ఎవరూ కిమ్ మాటల్ని నమ్మట్లేదు.
జెండాకర్రపై పోటాపోటీ..
1980లో డయిసియాంగ్-డాంగ్ గ్రామంలో తమ జాతీయ జెండా ఎగరవేయడం కోసం 98 మీటర్ల స్తంభాన్ని దక్షిణ కొరియా నిర్మించింది. 130 కిలోల బరువుండే జెండాను స్తంభానికి కట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఉత్తర కొరియా వెంటనే పొరుగుదేశం కన్నా గొప్పగా ఒక స్తంభం ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. 160 మీటర్ల ఎత్తుండే స్తంభాన్ని నిర్మించి, 270 కిలోల బరువుండే ఉత్తర కొరియా జాతీయ పతాకాన్ని ఎగరవేసింది. ఇలా ఇరు దేశాలు ఆయా గ్రామాలను ప్రతిష్టాత్మకంగా పర్యవేక్షిస్తున్నాయి.
కొన్నాళ్ల కిందటి వరకు ఇరు గ్రామాల్లో భారీ శబ్దాలు వినిపించడం తరచూ వార్తల్లోకెక్కేది. దక్షిణ కొరియాను ఇబ్బంది పెట్టడం కోసం ఉత్తర కొరియా.. కిజొంగ్-డాన్ గ్రామంలోని భవనాలపై భారీ స్పీకర్లు పెట్టి డయిసియాంగ్ గ్రామానికి వినిపించేలా పాశ్చాత్య సంస్కృతిని విమర్శించే ప్రసంగాలు, దేశ సైన్యానికి చెందిన పాటల్ని ప్లే చేసేది. దీనికి ప్రతిగా దక్షిణ కొరియా.. కిజొంగ్-డాన్ గ్రామానికి వినిపించేలా డయిసియాంగ్-డాన్ గ్రామంలో పాటల్ని పెద్దపెద్ద స్పీకర్లు పెట్టి ప్లే చేసేది. 1960 నుంచి తరచూ ఈ తంతు జరిగేది. 2018లో దీనిని నిలిపివేశారు.
- ఇంటర్నెట్ డెస్క్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Telangana News: అసహనంతో భాజపా నాయకులపై దాడులు: తెరాసపై ఈటల ఆగ్రహం
-
India News
Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
-
India News
Indian Army: సియాచిన్‌లో తప్పిపోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత లభ్యమైన మృతదేహం
-
World News
Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
-
Movies News
NTR 31: ‘ఎన్టీఆర్ 31’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. అదేంటంటే?
-
Sports News
T20 Cricket : టీ20ల్లో టాప్ స్కోరర్.. మళ్లీ రోహిత్‌ను అధిగమించిన కివీస్ ఓపెనర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: విజయ్ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్
- Flight: గర్ల్‌ఫ్రెండ్‌తో చాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Indraja: నాకు అమ్మాయి పుట్టేదాకా.. పెళ్లి విషయం ఎవరికీ తెలియదు: ఇంద్రజ
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Tirumala: 50మంది అనుచరులకు శ్రీవారి బ్రేక్ దర్శనం.. ఏపీ మంత్రిపై విమర్శలు
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Jio Phone 5G: జియో 5జీ ఫోన్.. ధర, ఫీచర్లు, విడుదల తేదీ వివరాలివే!