Union Cabinet: మరో 3 కోట్ల పేదల ఇళ్లు

దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదల నివాస అవసరాలను తీర్చడానికి ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 11 Jun 2024 06:21 IST

కేంద్ర క్యాబినెట్‌ తొలి సమావేశంలో నిర్ణయం 

క్యాబినెట్‌ సమావేశంలో పాల్గొన్న నరేంద్రమోదీ, రాజ్‌నాథ్‌ సింగ్, అమిత్‌షా

ఈనాడు, దిల్లీ: దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదల నివాస అవసరాలను తీర్చడానికి ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్‌ ఆదివారం కొలువుదీరాక సోమవారం జరిగిన తొలి క్యాబినెట్‌ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర పడింది. అర్హులైన పేదలకు ప్రాథమిక సౌకర్యాలతో కూడిన ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం 2015-16 నుంచి ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. గత పదేళ్లలో 4.21 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అర్హులైన పేదలకు అందించింది. ఇప్పుడు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఇతరత్రా పథకాలను సమ్మిళితం చేసి ఆ ఇళ్లలో మరుగుదొడ్లు, ఎల్‌పీజీ కనెక్షన్, విద్యుత్తు, తాగునీటి కొళాయిలాంటి సౌకర్యాలను అందజేస్తోంది. 

నేను విశ్రాంతి తీసుకోవడానికి పుట్టలేదు

పదేళ్ల క్రితం ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) అధికారానికి కేంద్రంగా ఉండేదని.. తానొచ్చిన తర్వాత అది సేవా కేంద్రంగా, ప్రజల పీఎంవోగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమవారం ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోదీ పీఎంవో సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘దేశం ప్రథమం’ అనే లక్ష్యంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. తాను విశ్రాంతి తీసుకోవడానికి పుట్టలేదని చెప్పారు. వికసిత భారతమే తన లక్ష్యమని.. ఇందుకోసం తాను విరామం లేకుండా పనిచేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా మోదీ తన విజయ రహస్యాన్ని తెలిపారు. ‘‘విజయ రహస్యమేంటని చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తారు. అలసట రాదా..అని అంటారు. వారు నా శరీరాన్ని మాత్రమే చూస్తారు. ఏం తింటాను, ఎంత సేపు పడుకుంటాను, యోగా ఎంతసేపు చేస్తానని ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తే వారికి సమాధానం దొరకదు. నా శక్తికి కారణం తెలియదు. నా రహస్యమేంటంటే.. నా లోపల విద్యార్థిని ఎప్పుడూ సజీవంగా ఉంచుకుంటాను. ఏ వ్యక్తి అయితే తన లోపల విద్యార్థిని రక్షించుకుంటాడో.. అతని సామర్థ్యం ఎన్నటికీ నశించదు. శక్తి హీనుడవ్వడు. నిత్యం కాంతితో ప్రకాశిస్తాడు’’ అని మోదీ పేర్కొన్నారు. 140 కోట్ల మంది ప్రజలు తన దృష్టిలో నాగరికులు కారని.. పరమాత్మ స్వరూపులని మోదీ తెలిపారు. తాను జీవించే ప్రతి క్షణం దేశం కోసమేనని చెప్పారు. 


పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై ప్రధాని తొలి సంతకం

ఈనాడు, దిల్లీ: వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై తొలి సంతకం చేశారు. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతిభవన్‌లో పదవీ ప్రమాణస్వీకారం చేసిన ఆయన సోమవారం ఉదయం ఇక్కడి సౌత్‌బ్లాక్‌లో అడుగుపెట్టారు. ఆయనకు ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది వరుసగా నిలబడి స్వాగతం పలికారు. వారందరికీ నమస్కరిస్తూ తన కార్యాలయంలోకి వెళ్లి మోదీ బాధ్యతలు స్వీకరించారు. వెంటనే పీఎం కిసాన్‌ 17వ వాయిదా చెల్లింపు దస్త్రంపై సంతకం చేశారు. దీనివల్ల 9.3 కోట్ల మంది రైతులకు రూ.20వేల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలగనుంది. ‘‘మా ప్రభుత్వం రైతు సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉంది. అందుకే బాధ్యతలు చేపట్టిన వెంటనే వారికి సంబంధించిన దస్త్రంపై సంతకంచేశాను. రాబోయే రోజుల్లో రైతులు, వ్యవసాయరంగం కోసం మరింత చేయాలనుకుంటున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. తొలి సంతకంతో రైతులకు మోదీ ప్రత్యేకంగా చేసిన మేలేమీ లేదని కాంగ్రెస్‌ విమర్శించింది. ఎన్నికల నియమావళి కారణంగా ఆగిపోయిన నిధులను మాత్రమే ప్రధాని విడుదల చేశారని పేర్కొంది. రైతుల సంక్షేమం కోసం ఏదైనా చేయాలని మోదీకి భావిస్తే.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని