Selfie with Money: నోట్ల కట్టలతో భార్యాపిల్లల సెల్ఫీ.. చిక్కుల్లో పోలీసు

ఓ పోలీసు అధికారి ఊహించని విధంగా చిక్కుల్లో పడ్డారు. ఆయన భార్యా, పిల్లలు నోట్ల కట్టలతో సెల్ఫీలు (Selfie with Money) దిగి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో అధికారులు ఆయనపై చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో జరిగిందీ ఘటన.

Published : 30 Jun 2023 10:04 IST

లఖ్‌నవూ: భార్యా, పిల్లల సెల్ఫీ కారణంగా ఓ పోలీసు అధికారి (Police Officer)పై బదిలీ వేటు పడింది. వారు తీసుకున్న ఫొటోలో రూ.500 నోట్ల కట్టలు ఉండటమే అందుకు కారణంగా నిలిచింది. ఈ ఫొటోలు వైరల్‌గా మారిన తక్షణమే ఆయన్ను మరో చోటుకు ట్రాన్స్‌ఫర్‌ చేయడమే గాక.. ఘటనపై దర్యాప్తు కూడా చేపట్టారు. అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)కు చెందిన రమేశ్ చంద్ర సహానీ ఉన్నావ్‌లోని బెహ్తా ముజవార్‌ పోలీసు స్టేషన్‌లో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (SHO)గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఇటీవల ఆయన కుటుంబ సభ్యుల ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. అందులో ఆయన భార్య, ఇద్దరు పిల్లలు బెడ్‌పై కూర్చుని దాదాపు 30 వరకు రూ.500 నోట్ల కట్టలను పరిచి సెల్ఫీలు (Selfie with Money), ఫొటోలు తీసుకున్నారు. ఈ ఫొటోలను వారు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో వివాదాస్పదంగా మారింది.

దీంతో, సీనియర్‌ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తును ఆదేశించారు. మరోవైపు, ఆయనను తక్షణమే పోలీసు లైన్స్‌కు బదిలీ చేసినట్లు స్థానిక ఎస్పీ తెలిపారు. కాగా, ఈ వార్తలపై రమేశ్ చంద్ర సహానీ స్పందించారు. ఆ ఫొటో 2021 నవంబరు 14 నాటిదని తెలిపారు. తమ కుటుంబానికి చెందిన ఓ ఆస్తిని విక్రయించడం ద్వారా ఆ సొమ్ము వచ్చినట్లు చెప్పారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఆ నోట్ల కట్టల విలువ ఎంతో పోలీసులు వెల్లడించలేదు గానీ.. రూ.14లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని