UP: దొంగతనానికి వచ్చి.. నిద్రలోకి జారుకొని..!

దొంగతనానికి వచ్చిన ఓ దొంగ నిద్రలోకి జారుకోవడంతో పోలీసులకు చిక్కిన వైనం లఖ్‌నవూలో జరిగింది. 

Updated : 03 Jun 2024 13:54 IST

లఖ్‌నవూ: దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి (Thief) తన పనిని మర్చిపోయి నిద్రలోకి జారుకున్న ఘటన లఖ్‌నవూ(Lucknow)లోని ఇందిరానగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దొంగ చొరబడిన ఇల్లు వైద్యుడు సునీల్‌ పాండేకు చెందినది. ఆయన వారణాసిలోని బల్‌రాంపూర్ హాస్పిటల్‌లో పని చేస్తుండడంతో ఇక్కడినుంచి వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నారు. దాంతో ఇందిరానగర్‌లోని ఇల్లు ఖాళీగా ఉంటుంది. దీన్ని గమనించిన దొంగ ఓ రాత్రివేళ ఇంట్లోకి చొరబడి అల్మారా పగలగొట్టి అందులో ఉన్న నగలు, నగదు దోచుకున్నాడు. వాష్‌బేసిన్‌, గ్యాస్‌ సిలిండర్, నీటి పంపును సైతం దొంగలించడానికి ప్రయత్నించాడు. హౌస్ బ్యాటరీని తొలగిస్తుండగా మత్తుగా అనిపించి అక్కడే నిద్ర పోయాడు అని పోలీసులు తెలిపారు. 

ఉదయం వైద్యుడి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చి ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులన్నీ మూటగట్టి ఉన్నాయి. దొంగ నిద్రిస్తున్నట్లుగా గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని దొంగను నిద్ర లేపారు. నిద్ర లేచేసరికి చుట్టూ పోలీసులు ఉండడంతో ఒక్కసారిగా కంగుతిన్న దొంగ చేసేదేమీ లేక లొంగిపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని