US visa: విద్యార్థులకు శుభవార్త.. అమెరికా వీసా స్లాట్లు విడుదల

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు (Education in US) అవసరమయ్యే విద్యార్థి వీసా (ఎఫ్‌-1) కోసం ఇంటర్వ్యూల అపాయింట్‌మెంట్‌ స్లాట్లు అందుబాటులో ఉన్నాయని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.

Updated : 19 Jun 2023 15:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు (Education in US) సిద్ధమయ్యేవారికి ఊరట కలిగించే విషయం. ఎంతోకాలంగా వేచి చూస్తున్న విద్యార్థి వీసా (ఎఫ్‌-1) ఇంటర్వ్యూల అపాయింట్‌మెంట్‌ స్లాట్లు విడుదలయ్యాయి. జులై నుంచి ఆగస్టు మధ్య కాలానికి ప్రస్తుతం ఇవి అందుబాటులో ఉన్నాయని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ustraveldocs.com సందర్శించి అపాయింట్‌మెంట్లను బుక్‌ చేసుకోవచ్చని (US Embassy) సూచించింది.

అమెరికాలో ఉన్నత విద్యకోసం ఏటా వెళ్లేవారిలో భారతీయులే ఎక్కువగా ఉంటున్నారు. గతేడాది 1.25 లక్షల మంది విద్యార్థులకు వీసాలు (Student visa) జారీ చేసింది. మరే దేశానికి ఈ స్థాయిలో వీసాలు ఇవ్వలేదు. అమెరికాకు వచ్చే ప్రతి ఐదుగురిలో ఒకరు భారతీయ విద్యార్థి ఉంటున్నారని.. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ఇటీవల జరిగిన వీసా డే వార్షికోత్సవం సందర్భంగా ఒకే రోజు దేశవ్యాప్తంగా ఉన్న కాన్సులేట్ల ద్వారా 3500 మంది విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు అమెరికన్‌ ఎంబసీ వెల్లడించింది.

ఇదిలాఉంటే, అమెరికాలోని విద్యాసంస్థలు ప్రతి సంవత్సరం రెండుసార్లు ప్రవేశాలను అనుమతిస్తాయి. ఆగస్టు-డిసెంబర్‌ సెమిస్టర్‌ సమయంలోనే మన దేశ విద్యార్థులు అధికంగా వెళుతుంటారు. ఇప్పటికే అనేక మంది భారతీయ విద్యార్థులు వివిధ వర్సిటీల నుంచి ఐ-20 ధ్రువపత్రాలను పొందారు. వీరికి దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు హైదరాబాద్‌, చెన్నై, ముంబయి, కోల్‌కతాల్లోని కాన్సులేట్‌ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని