Uttarkashi: హిమాలయాల్లో ప్రమాదం.. ట్రెక్కింగ్‌ చేస్తూ నలుగురి మృతి

హిమాలయ పర్వతాలలోని సహస్రతల్‌ ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో నలుగురు ట్రెక్కర్లు మృతి చెందారు. మరో 18 మంది మంచులో చిక్కుకుపోయారు.

Published : 05 Jun 2024 16:02 IST

ఉత్తరకాశీ: హిమాలయ పర్వతాలపై ట్రెక్కింగ్‌ (trekking)  చేస్తూ ప్రమాదవశాత్తూ నలుగురు మరణించిన ఘటన సహస్రతల్(Sahastratal)  ప్రాంతంలో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు స్థానిక గైడ్‌లతో పాటు కర్ణాటకకు చెందిన 18 మంది ట్రెక్కర్లు, మహారాష్ట్రకు చెందిన ఒకరు హిమాలయాల్లో 4,100-4,400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతల్ ఆల్పైన్ సరస్సు వద్ద బుధవారం ట్రెక్కింగ్ చేస్తుండగా మంచులో చిక్కుకుపోయారు. వీరిలో నలుగురు మరణించగా మరో 18 మంది జాడ తెలియరాలేదని అధికారులు తెలిపారు.

హిమాలయన్ వ్యూ ట్రెక్కింగ్ ఏజెన్సీ(Trekking Agency) ‘మనేరి’ ద్వారా 22 మంది సభ్యుల ట్రెక్కింగ్ బృందం మే 29న ఉత్తరకాశీ నుంచి 35 కి.మీ. దూరంలో ఉన్న ట్రెక్కింగ్‌ పాయింట్‌కు చేరుకుందని ఉత్తరకాశీ జిల్లా మేజిస్ట్రేట్ మెహర్బన్ సింగ్ బిష్త్(Meharban Singh Bisht) తెలిపారు. జూన్ 7 నాటికి బృందం తిరిగి రావాల్సిఉందని, కానీ చివరి బేస్ క్యాంప్ నుంచి సహస్రతల్‌కు చేరుకునేసరికి వాతావరణం సరిగా లేకపోవడంతో వారు దారి తప్పారని బిష్త్ చెప్పారు. అనంతరం బృందంలోని నలుగురు సభ్యులు మరణించారని, ఇతరులు చిక్కుకుపోయారని ట్రెక్కింగ్ ఏజెన్సీ నిర్థరించింది. వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఏరియల్ రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టామని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. చిక్కుకుపోయిన వారిని రక్షించాలని, మరణించిన వారి మృతదేహాలను గుర్తించాలని భారత వైమానిక దళాన్ని అభ్యర్థించామన్నారు. మట్లీ, హర్సిల్, ఇతర హెలిప్యాడ్‌ల నుంచి సహాయక చర్యలకు ఏర్పాట్లుచేసినట్లు తెలిపారు.  

అటవీ శాఖకు చెందిన 10 మంది సభ్యుల రెస్క్యూ టీమ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌(SDRF) బృందం బుధవారం తెల్లవారుజామున ఉత్తరకాశీ నుంచి బయలుదేరాయని పేర్కొన్నారు. ఉత్తరకాశీ జిల్లా ఆసుపత్రి, భట్వాడీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేశామని, 14మంది రక్షణ సిబ్బంది, ఒక వైద్యుడిని ఘటనా స్థలానికి పంపామని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే తరలించడానికి హెలికాప్టర్‌, అంబులెన్స్‌లను సిద్ధం చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని