Vande Bharat: ‘వందేభారత్‌’.. సంఖ్య పెరుగుతోంది.. వేగం తగ్గుతోంది !

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్‌ రైళ్ల (Vande Bharat trains) సరాసరి వేగం గత మూడేళ్లలో గంటకు 84.48 కి.మీ. నుంచి 76.25 కి.మీ.లకు పడిపోయినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.

Published : 07 Jun 2024 18:29 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్‌ రైళ్ల (Vande Bharat trains)  సరాసరి వేగం గత మూడేళ్లలో గంటకు 84.48 కి.మీ. నుంచి 76.25 కి.మీ.లకు పడిపోయినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఈమేరకు సమాచార హక్కు చట్టం ( సహచ) ద్వారా మధ్యప్రదేశ్‌కు (Madhyapradesh) చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌ చేసిన దరఖాస్తుకు అధికారులు సమాధానమిచ్చారు. కేవలం వందేభారత్‌ రైళ్లు మాత్రమే కాదని, వివిధ మార్గాల్లో ట్రాక్‌ పునరుద్ధరణ, స్టేషన్ల నవీకరణ కారణంగా సాధారణ రైళ్ల వేగం కూడా తగ్గిందని పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లోనూ వందే భారత్‌ నడుస్తున్నట్లు పేర్కొన్న రైల్వేశాఖ.. అక్కడి వాతావరణ పరిస్థితులు, ట్రాక్‌ నాణ్యతను బట్టి కూడా వేగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఏర్పడుతోందని వివరించింది. ‘‘ఉదాహరణకు ముంబయి-మడగావ్‌ మార్గంలో అధిక భాగం కొండ ప్రాంతంలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో గరిష్ఠ వేగంతో ప్రయాణించడం అత్యంత ప్రమాదకరం. వర్షాకాలంలో పరిస్థితులు మరింత జటిలంగా మారుతాయి’’ అని రైల్వేశాఖ అధికారులు వివరించారు.

రైల్వేశాఖ ఇచ్చిన వివరాల ప్రకారం.. 2020-21లో వందేభారత్‌ రైళ్ల సరాసరి వేగం గంటకు 84.48 కి.మీ. కాగా.. 2022-23 నాటికి ఆ వేగం 81.38 కి.మీ.లకు, 2023-24 (ప్రస్తుతం) నాటికి 76.25 కి.మీ.లకు పడిపోయింది. 2019, ఫిబ్రవరి 15న తొలిసారిగా వందేభారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సమయంలో గరిష్ఠంగా గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే, దిల్లీ- ఆగ్రా మార్గంలో తప్ప.. ఇతర మార్గాల్లో 130 కి.మీ/గంటకు మించరాదని తెలిపింది. భారత్‌లో తొలి సెమీహైస్పీడ్‌ రైలు గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ను 160 కి.మీ. వేగంతో నడిపించాలనే ఉద్దేశంతో, దిల్లీ- ఆగ్రా మార్గాన్ని 2016లో అత్యాధునిక టెక్నాలజీతో పునరుద్ధరించారు. అందువల్ల ఆ మార్గంలో వందేభారత్‌ గరిష్ఠ వేగంతో ప్రయాణించే వీలుంది.

వందే భారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చి ఐదేళ్లు పూర్తయినా, చాలా మార్గాల్లో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు ఇంకా పూర్తికాలేదు. దీని ప్రభావం రైళ్ల వేగంపై పడుతోంది. ట్రాక్‌ సామర్థ్యం పెరిగితే.. వేగం కూడా పెరిగే అవకాశముంది. మరోవైపు వందేభారత్‌ రైళ్లకు విశేష ఆదరణ లభిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. మార్చి 31 వరకు 2.51 కోట్లకు పైగా ప్రజలు ఇందులో ప్రయాణం చేసినట్లు పేర్కొంది. 2019 ఫిబ్రవరి 15న కేవలం ఒకే రైలుతో వందేభారత్‌ ప్రారంభం కాగా.. క్రమంగా ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 100 మార్గాల్లో 102 రైళ్లు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా 284 జిల్లాల పరిధిలో సేవలు అందిస్తున్నాయి. భవిష్యత్‌లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని