Vande Bharat: వందేభారత్‌లో భోజనం దుర్వాసన.. ప్రయాణికుడు ఏం చేశాడంటే..!

వందేభారత్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి సిబ్బంది నాసిరకమైన భోజనాన్ని అందించారు. దుర్వాసన వస్తుండటంతో వీడియో తీసి అతడు ఎక్స్‌లో పోస్టు చేశారు.

Published : 11 Jan 2024 19:30 IST

దిల్లీ: సాధారణ రైళ్లతో పోలిస్తే, వందేభారత్‌ (Vande Bharat) టికెట్‌ ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ.. తొందరగా గమ్యస్థానాలకు చేరుకోవడంతోపాటు, నాణ్యమైన క్యాటరింగ్‌ సదుపాయం ఉందన్న కారణంతో చాలా మంది వాటినే ఎంపిక చేసుకుంటున్నారు. కానీ, దిల్లీ (Delhi) నుంచి వారణాసి (Varanasi) వెళ్తున్న ఆకాశ్‌ కేసరి అనే ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. రైల్వేసిబ్బంది తీసుకొచ్చిన భోజనం నాసిరకంగా ఉండటమే కాకుండా, దుర్వాసన వచ్చింది. తీవ్ర అసహనానికి గురైన అతడు వెంటనే వీడియో తీసి.. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇండియన్‌ రైల్వేస్‌, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌, రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలను కూడా ట్యాగ్‌ చేశారు. భోజనం సరిగా లేనందుకు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని (రిఫండ్‌) కోరారు. 

ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో, ‘రైల్వే సేవ’ విభాగం స్పందించింది. రైల్‌ మదద్ పోర్టల్‌లో అధికారికంగా ఫిర్యాదును నమోదు చేసినట్లు చెబుతూ.. ఆ ఐడీ నెంబర్‌ను కూడా ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. అంతేకాకుండా పీఎన్‌ఆర్‌ నెంబర్‌, మొబైల్‌ నెంబర్‌ను ఎస్‌ఎంఎస్‌ ద్వారా తమకు అందించాలని కోరింది. ఈ పోస్టుపై ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) కూడా స్పందించింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని, సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని