Varun Gandhi: ‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్‌ గాంధీ భావోద్వేగ లేఖ

Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్‌ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్‌గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు.

Updated : 28 Mar 2024 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సొంత పార్టీపైనే విమర్శలు చేసి వార్తల్లో నిలిచిన భాజపా (BJP) ఎంపీ వరుణ్‌ గాంధీ (Varun Gandhi)కి తాజా ఎన్నికల్లో టికెట్‌ దక్కలేదు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పీలీభీత్‌ స్థానంలో ఈసారి రాష్ట్ర మంత్రి జితిన్‌ ప్రసాదను నిలబెట్టింది కాషాయ పార్టీ. దీంతో వరుణ్‌గాంధీ భవిష్యత్తు కార్యాచరణపై ఆసక్తి రేగింది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? లేదా కాంగ్రెస్‌లో చేరతారా?అనే ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాల వేళ తన నియోజకవర్గ ప్రజలకు ఆయన భావోద్వేగపూరితమైన లేఖను రాశారు. ఈ ప్రాంతంతో తన బంధం విడదీయరానిదని చెప్పారు.

‘‘1983లో మూడేళ్ల వయసులో మా అమ్మ వేలు పట్టుకొని ఈ ప్రాంతంలో అడుగుపెట్టడం ఇప్పటికీ నాకు గుర్తే. ఈ ప్రజలంతా నా కుటుంబమే. ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో (ప్రజలనుద్దేశించి) నా బంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్‌ ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడి ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. ఎంపీగా లేకపోయినా.. ఒక కుమారుడిగా మీకు సేవ చేస్తా. మీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. సామాన్యుల తరఫున గళమెత్తేందుకే రాజకీయాల్లోకి వచ్చా. ఎట్టిపరిస్థితుల్లోనూ అది కొనసాగించేందుకు మీ ఆశీర్వాదం కావాలి’’ అని వరుణ్‌ రాసుకొచ్చారు.

రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ

కొంతకాలంగా భాజపా కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల తీరుపై వరుణ్‌గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈక్రమంలోనే గతేడాది కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఆయన కేదార్‌నాథ్‌లో కలుసుకోవడం ఆసక్తికర చర్చకు దారితీసింది. భాజపాకు దూరంగా ఉంటున్న ఆయన పార్టీ మారే అవకాశం ఉందంటూ అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో తాజాగా ఆయనకు కమలదళంలో టికెట్‌ దక్కకపోవడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, వరుణ్‌ తల్లి మేనకాగాంధీని యూపీలోని సుల్తాన్‌పుర్‌ నుంచి భాజపా మరోసారి బరిలోకి దించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని