Varun Gandhi: భాజపా నిరాకరిస్తే.. స్వతంత్ర అభ్యర్థిగా వరుణ్‌ గాంధీ?

లోక్‌సభ ఎన్నికల్లో పీలీభీత్‌ నుంచి భాజపా టికెట్‌ నిరాకరిస్తే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు వరుణ్‌ గాంధీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Published : 20 Mar 2024 16:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ (Varun Gandhi) కొంతకాలంగా సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ఆయనకు అవకాశం లభిస్తుందా?అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో ఒకవేళ భాజపా టికెట్టు ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు వరుణ్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో పీలీభీత్‌ (UP) పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలో నిలిచిన ఆయన.. మూడోసారి ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి యూపీలో 51 స్థానాలకు భాజపా తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించింది. మరో 24 సీట్లను ఖరారు చేయలేదు. అందులో వరుణ్‌ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తోన్న పీలీభీత్‌, ఆయన తల్లి మేనకా గాంధీ ఎంపీగా ఉన్న సుల్తాన్‌పుర్‌లు ఉన్నాయి. అయితే, ఈసారి మేనకా గాంధీకి సుల్తాన్‌పుర్‌ ఖరారు చేసే అవకాశం ఉన్నప్పటికీ వరుణ్‌కు మాత్రం మొండిచేయి చూపొచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన స్థానంలో యూపీ మంత్రి జితిన్‌ ప్రసాద లేదా పీలీభీత్‌ ఎమ్మెల్యేకు చోటు కల్పించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. వరుణ్‌ గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ కూడా వరుణ్‌ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే, భాజపా కేంద్ర నాయకత్వంతోపాటు యూపీ అధికార పక్షం తీరుపై వరుణ్‌ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని వరుణ్‌ గాంధీ కేదార్‌నాథ్‌లో కలుసుకోవడం ఆసక్తికర చర్చకు తెరతీసింది. దీంతో భాజపాకు దూరంగా ఉంటున్న వరుణ్‌- పార్టీ మారే అవకాశం ఉందన్న వార్తలు కూడా వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని