Varun Gandhi: అది స్వచ్ఛమైన ప్రేమ.. ఆ ఇద్దరిని కలపండి..!

యువకుడితో కొంగ స్నేహం ఎందరో హృదయాలను తాకింది. ఇప్పుడు వారిద్దరి మధ్య ఏర్పడిన ఎడబాటుపై భాజపా నేత వరుణ్ గాంధీ(Varun Gandhi) స్పందించారు. 

Published : 12 Apr 2023 21:29 IST

అమేఠీ: ఆ మధ్య ఓ యువకుడితో కొంగ స్నేహం వార్త అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత అటవీశాఖ అధికారులు ఆ కొంగను పక్షుల సంరక్షణా కేంద్రానికి తరలించారు. దాంతో ఆ యువ రైతు మహమ్మద్‌ ఆరిఫ్ , పక్షికి మధ్య ఎడబాటు ఏర్పడింది. ఆ సారస్‌ కొంగ మీద బెంగతో అతడు కన్నీరు పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో కొంగను విడుదల చేయాలని, వారిద్దరి మధ్య స్నేహం ఎప్పటిలా కొనసాగాలని ఎంతోమంది కోరుకుంటున్నారు. అందులో భాజపా ఎంపీ వరుణ్ గాంధీ(Varun Gandhi) కూడా చేరారు.

ఉత్తరప్రదేశ్‌(Uttar pradesh) రాష్ట్రం అమేఠి జిల్లాలోని మండ్కా గ్రామానికి చెందిన మహమ్మద్‌ ఆరిఫ్‌ ఖాన్‌(Arif Khan)వ్యవసాయం చేస్తుంటాడు. ఏడాది క్రితం ఆరిఫ్‌ పొలంలో ఈ ‘సారస్‌’ కొంగ(Sarus crane) కనిపించింది. కాలు విరిగిపోయి, రక్తమోడుతూ ఉంది. కొంగ గాయం కడిగి.. పసుపు, ఆవాల మిశ్రమం వేసి వెదురు పుల్లలతో ఆరిఫ్‌ కట్టు కట్టాడు. కోలుకున్న కొంగ తనను కాపాడిన ఆరిఫ్‌తోనే ఉండిపోయింది. కొంగ ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)రాష్ట్ర పక్షి. రాష్ట్ర పక్షులను సంరక్షించాలన్న ఉద్దేశంతో అటవీశాఖ అధికారులు ఆరిఫ్‌ వద్ద ఉన్న కొంగను ఇటీవల రాయ్‌బరేలీలోని సమస్‌పుర్‌ పక్షుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. మంగళవారం దానిని చూసేందుకు అరిఫ్ సంరక్షణా కేంద్రానికి వెళ్లారు. అతడిని చూసిన సారస్ రెక్కలు విదిల్చి ఆనందపడింది. వైరల్‌గా మారిన ఈ వీడియోను వరుణ్(Varun Gandhi) షేర్ చేస్తూ.. వారిద్దరు మళ్లీ ఒకదగ్గరికి చేరాలని కోరుకున్నారు. 

‘వారి మధ్య ఉన్న ప్రేమ స్వచ్ఛమైంది. ఈ అందమైన పక్షిని పంజరంలో బంధించడం కాదు, స్వేచ్ఛగా ఎగరనివ్వాలి. దాని స్వేచ్ఛను, స్నేహితుడిని తిరిగి ఇవ్వాలి’ అని ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఇంతకుముందు ఇదే విషయంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్(Samajwadi Party President Akhilesh Yadav) స్పందించారు. ‘మనుషుల మధ్య ప్రేమ అయినా.. ఒక మనిషికి, పక్షికి మధ్య ప్రేమ అయినా.. ఆ వాతావరణం భాజపా వాళ్లకు నచ్చదు’ అంటూ విమర్శించారు. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని