Navy Chief: నూతన నావికాదళాధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠి

Navy Chief: అడ్మిరల్‌ దినేశ్‌ కుమార్‌ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్‌ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. 

Published : 19 Apr 2024 11:41 IST

దిల్లీ: నూతన నావికాదళాధిపతిగా (Navy Chief) వైస్‌ అడ్మిరల్‌ దినేశ్‌ కుమార్‌ త్రిపాఠి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆ హోదాలో ఉన్న అడ్మిరల్‌ ఆర్‌.హరి కుమార్‌ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు.

ప్రస్తుతం త్రిపాఠి (Dinesh Kumar Tripathi) భారత నావికాదళ వైస్‌ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. 1964 మే 15న జన్మించిన ఆయన 1985 జులై 1న భారత నేవీ ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో చేరారు. కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌లో నిపుణుడిగా పేరుగాంచిన ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. వైఫ్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు వెస్టర్న్‌ నావల్‌ కమాండ్‌కు ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఐఎన్‌ఎస్‌ వినాశ్‌ను కమాండ్‌ చేసిన అనుభవమూ ఉంది.

వెస్టర్న్‌ ఫ్లీట్‌కు ఆపరేషన్స్‌ ఆఫీసర్‌, నావల్‌ ఆపరేషన్స్‌కు డైరెక్టర్‌, నెట్‌వర్క్‌ సెంట్రిక్‌ ఆపరేషన్స్‌కు ప్రధాన డైరెక్టర్‌, దిల్లీలో నావల్‌ ప్లాన్స్‌కు ప్రధాన డైరెక్టర్‌గా పనిచేశారు. ఈస్టర్న్‌ ఫ్లీట్‌లోనూ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌గా వ్యవహరించారు. ప్రఖ్యాత ఇండియన్ నావల్‌ అకాడమీకి కమాండంట్‌గానూ సేవలందించారు.

రేవాలోని సైనిక్‌ స్కూల్‌, ఖడక్వాస్లాలోని ఎన్‌డీయే పూర్వ విద్యార్థి అయిన త్రిపాఠి.. నావల్‌ వార్‌ కాలేజ్‌ గోవాతో పాటు యూఎస్‌ఏలోనూ వివిధ కోర్సులు పూర్తి చేశారు. అతి విశిష్ఠ్‌ సేవా మెడల్‌, నౌసేన మెడల్‌ పురస్కారాలను అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని