Jagdeep Dhankar: గాంధీ మహా పురుషుడు.. మోదీ యుగ పురుషుడు: ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌

ప్రముఖ జైన మత గురువు, ఆధ్యాత్మిక వేత్త శ్రీమద్‌ రాజ్‌చంద్రాజీ జయంతి వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 

Updated : 28 Nov 2023 03:18 IST

ముంబయి: భారత జాతిపిత మహత్మాగాంధీ(Mahatma Gandhi) గత శతాబ్దంలో మహా పురుషుడు(Mahapurush) అయితే, ఈ శతాబ్దంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) యుగ పురుషుడు(Yugpurush) అని భారత ఉపరాష్ట్రపతి(Vice President) జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌(Jagdeep Dhankar) అభివర్ణించారు. సత్యాగ్రహం, అహింస ద్వారా మహాత్మాగాంధీ మనల్ని బ్రిటిష్‌ పాలకుల బానిసత్వం నుంచి విముక్తుల్ని చేస్తే..  మనం ఏ మార్గంలో నడవాలని కోరుకుంటామో ప్రధాని నరేంద్ర మోదీ మనల్ని అదే మార్గంలోకి తీసుకెళ్లారు అని ఉపరాష్ట్రపతి అన్నారు. జైన ఆధ్యాత్మిక వేత్త, తత్వవేత్త శ్రీమద్‌ రాజ్‌చంద్రాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.

ముంబయిలో శ్రీమద్‌ రాజ్‌చంద్రాజీ జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడుతూ.. ‘‘మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. గత శతాబ్దపు మహా పురుషుడు మహాత్మా గాంధీ అయితే ఈ శతాబ్దపు యుగ పురుషుడు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ఇద్దరి మధ్య ఒక సారూప్యత కనిపిస్తుంది. ఈ ఇద్దరూ శ్రీమద్‌ రాజ్‌చంద్రాజీని ఎంతో గౌరవిస్తారు. అని ధన్‌ఖడ్‌ అన్నారు. ‘‘జాతి, దేశ ఎదుగుదలను వ్యతిరేకించే, జీర్ణం చేసుకోలేని శక్తులు ఏకం అవుతున్నాయి. దేశంలో ఏదైనా మంచి జరిగితే ఆ శక్తులు వ్యతిరేకంగా పయనిస్తున్నాయి. ఇలాంటిది ఇక జరగకూడదు. మన ముందు పెను ప్రమాదం పొంచి ఉంది. మన చుట్టూ ఉన్న దేశాల చరిత్ర చాలా చిన్నది. మూడు వందలో, ఐదు వందలో లేదా ఏడు వందల ఏళ్ల చరిత్ర వాళ్లది. కాని మనది 5000 ఏళ్ల నాటి చరిత్ర’’ అని ధన్‌ఖడ్‌ అన్నారు. 

1867లో గుజరాత్‌లో జన్మించిన శ్రీమద్‌ రాజ్‌చంద్రాజీ ఆధ్యాత్మికవేత్తగా ప్రసిద్ధి చెందారు. జైనిజం, మహాత్మా గాంధీ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడంలో రాజ్‌చంద్రాజీ బోధనలు ఎంతగానో తోడ్పాటును అందించాయి. 1891లో శ్రీమద్‌ రాజ్‌చంద్రాజీని గాంధీ తొలిసారి కలిశారు. అప్పటి నుంచి ఆయన బోధనల పట్ల గాంధీ ఆకర్షితులయ్యారు. గుజరాత్‌లోని ధరమ్‌పుర్‌లో శ్రీమద్‌ రాజ్‌చంద్రాజీ మిషన్‌ ఉంది. సమాజ శ్రేయస్సుతో పాటు ఆధ్యాత్మిక మార్గంలో పయనించేందుకు ఈ మిషన్‌ ఎంతో కృషి చేస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని