West Bengal: ఈవీఎంలను చెరువులోకి విసిరి..బాంబులతో దాడి చేసి..ఎన్నికల వేళ కలకలం

ఓ అల్లరి మూక పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని(EVM) చెరువులో విసిరేసిన ఘటన పశ్చిమ బెంగాల్‌ కుల్తాలీ గ్రామంలో చోటుచేసుకుంది.

Updated : 01 Jun 2024 12:38 IST

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్‌లో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో నేడు(శనివారం) పోలింగ్‌ జరుగుతోంది.  బెంగాల్‌ జయనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓ అల్లరిమూక  పోలింగ్ స్టేషన్‌లోకి చొరబడి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని(EVM) చెరువులో విసిరేసిన ఘటనతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుల్తాలీ గ్రామంలో పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో స్థానికులకు, పోలింగ్‌ ఏజెంట్లకు మధ్య వివాదం చెలరేగింది. బేనిమాధవ్‌పూర్ ఎఫ్‌పి స్కూల్ బూత్‌లోకి ఏజెంట్లను రానీయకుండా కొంతమంది అడ్డుకోవడంతో కలకలం రేగింది. వీరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు బలవంతంగా పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించారు. ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్(VVPAT)తో కూడిన ఈవీఎంను బయటకు తీసుకెళ్లి చెరువులో పడేశారు.

ఘటనపై సెక్టార్ ఆఫీసర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ‘‘సెక్టార్ పరిధిలోని మొత్తం ఆరు బూత్‌లలో పోలింగ్ ప్రక్రియ అంతరాయం లేకుండా సాగుతోంది. ఈవీఎంను చెరువులో పడేసిన చోట కొత్త ఈవీఎం, పేపర్లను సెక్టార్ అధికారికి అందించాం’’ అని పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు.

మరో ఘటనలో కోల్‌కతాలోని జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని భాంగర్‌లోని సతులియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ISF), సీపీఐ(ఎం) కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. అనంతరం ఇరువర్గాలు పరస్పరం బాంబులతో దాడులకు దిగారు. ఈ ఘర్షణలో పలువురు ఐఎస్‌ఎఫ్‌ సభ్యులు గాయపడ్డారు. 

బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల ఏడో దశ పోలింగ్ ప్రక్రియ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. డమ్ డమ్, బరాసత్, బసిరాత్‌, జయనగర్, మధురాపూర్, డైమండ్ హార్బర్, జాదవ్‌పూర్, కోల్‌కతా దక్షిణ్, కోల్‌కతా ఉత్తర స్థానాల్లో సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని