Viral video: కస్టమర్‌ షూ ఎత్తుకెళ్లిన డెలివరీ బాయ్‌ వీడియో వైరల్‌

ఓ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ డెలివరీ బాయ్‌ కస్టమర్‌ ఇంటి ముందున్న షూ కొట్టేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Published : 12 Apr 2024 19:30 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఓ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ డెలివరీ బాయ్‌ కస్టమర్‌ ఇంటి ముందున్న షూ కొట్టేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో డెలివరీ బాయ్‌ ఓ కస్టమర్‌ ఆర్డర్‌ చేసిన కిరాణా ప్యాకేజీతో ఇంటివద్దకు వెళ్లాడు. డోర్‌ దగ్గర ఉన్న పాదరక్షలను పరిశీలనగా చూస్తూ నిల్చున్నాడు. అనంతరం తలుపు తెరిచిన ఓ మహిళ ప్యాకేజీ తీసుకొని లోపలికి వెళ్లారు.  అతడు కొంతసేపు ఫోన్‌ చూస్తున్నట్టుగా అక్కడే తచ్చాడుతూ మెట్లు దిగాడు. తలకు కట్టుకున్న వస్త్రం తీసి ముఖాన్ని తుడుచుకుంటున్నట్లుగా నటిస్తూ ముందుకువెళ్లాడు. అక్కడ ఎవరూ లేరని నిర్థారణకు వచ్చిన అనంతరం మెల్లిగా తలుపు దగ్గరికి వెళ్లి ఫ్లాట్ వెలుపల ఉన్న మూడు జతల షూలలో ఒకదాన్ని తీసుకొని వాటిని గుడ్డతో కప్పుకొని పారిపోయాడు.

ఈ తతంగమంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియోను బాధితుడి స్నేహితుడు గురువారం ఎక్స్‌లో పోస్టు చేస్తూ ‘స్విగ్గీ డ్రాప్‌ అండ్‌ పికప్‌ సర్వీస్‌’ అంటూ వ్యాఖ్య జత చేశారు. ఒక డెలివరీ బాయ్ తన స్నేహితుడి షూ దొంగిలించాడని, కంపెనీ అతడి వివరాలను తమకు తెలియజేయట్లేదని ఆరోపించారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండడంతో స్పందించిన స్విగ్గీ క్షమాపణలు కోరింది. ‘‘మా డెలివరీ ఏజెంట్ల నుంచి మెరుగైన సేవలనే కోరుకుంటున్నాము. మమ్మల్ని డీఎంలో సంప్రదించండి మేము మీకు తప్పక సహాయపడతాము.’’ అంటూ రాసుకొచ్చింది. వైరల్‌ వీడియోపై  నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్‌ ‘అతను వైట్‌ కలర్‌ షూ తీసుకుంటాడనుకున్నా’ అని చమత్కరించారు. ‘అలా షూలను బయట వదిలేయడం మీ తప్పే’ అని మరో నెటిజన్ స్పందించారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని