Modi: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తాం : మోదీ

ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతిచ్చే ఎంపీల జాబితాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అందజేశామని ప్రధాని మోదీ అన్నారు.

Updated : 07 Jun 2024 19:32 IST

దిల్లీ: ఎన్డీయే లోక్‌సభాపక్ష నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ.. కూటమి నేతలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతిచ్చే ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందజేశారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి మరింత సేవ చేయాలని ప్రజలు తమని ఆశీర్వదించారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పారు. 

ఆజాదీ కా అమృత్‌ ఉత్సవాల తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరిగినట్లు గుర్తు చేసిన మోదీ.. ప్రజల ఆకాంక్షల మేరకు మరింత ఉత్సాహంగా పని చేస్తామన్నారు. ప్రధానిగా గత పదేళ్లలో సంపాదించిన అనుభవాన్ని కూడగట్టుకొని రెట్టించిన బాధ్యతతో ముందుకెళ్తామన్నారు. 18వ లోక్‌సభలో యువత ఎక్కువ మంది ఉన్నారన్న మోదీ.. సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకొచ్చిన వారందరికీ అభినందనలు తెలిపారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తామని రాష్ట్రపతికి తెలియజేశామన్నారు.

పొరుగు దేశాల ప్రముఖుల సమక్షంలో నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజు కీలక శాఖల మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశముంది. శుక్రవారం ఉదయం జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్ర మోదీని లోక్‌సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. తొలుత మోదీ పేరును రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రతిపాదించగా.. తెదేపా అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ తదితర పార్టీల నేతలంగా ఏకగ్రీవంగా ఆమోదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని