Maharashtra Bus Accident: నిద్రలోనే అనంతలోకాలకు.. కళ్లముందే కాలిపోతున్నా ఏం చేయలేకపోయాం!

Maharashtra Bus Accident: మహారాష్ట్ర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కొందరు ప్రయాణికులు సహాయం కోసం అర్థిస్తూనే మంటల్లో కాలిపోయారని స్థానికులు తెలిపారు. 

Updated : 01 Jul 2023 11:49 IST

పుణె: మహారాష్ట్ర (Maharashtra)లో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటన సమయంలో ప్రయాణికుల్లో చాలామంది నిద్రిస్తున్నారని, బస్సు కాలిపోవడంతో వారు నిద్రలోనే సజీవదహనమయ్యారని తెలుస్తోంది. బుల్దానా జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు బస్సు కిటికీలు పగలగొట్టి ప్రాణాలతో బయటపడ్డారు. (Maharashtra bus tragedy)

‘‘టైరు పేలిపోవడంతో.. బస్సు డివైడర్‌ను ఢీ కొట్టింది. దాంతో క్షణాల్లో బస్సు అంతా మంటలు వ్యాపించాయి. వెనుకవైపు కిటికీలు బద్దలుకొట్టి నా తోటి ప్రయాణికుడు, నేను బయటపడ్డాం’’ అని ఓ ప్రయాణికుడు వెల్లడించారు. ఈ ప్రమాదం (Maharashtra Bus Accident)పై  స్థానికుడొకరు మాట్లాడుతూ కిటికీ అద్దాలు పగలగొట్టి నలుగురైదుగురు బయటపడినా.. అందరూ అలా చేయలేకపోయారని చెప్పారు. 

‘‘మమ్మల్ని సాయం కోసం బస్సులో ఉన్నవాళ్లు పిలిచారు. అయితే మేం వెళ్లేసరికే అక్కడ భయానక పరిస్థితి నెలకొని ఉంది. బస్సు లోపల ఉన్నవారు అద్దాలు పగలకొట్టేందుకు ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు. సాయం కోసం అర్థిస్తూనే మా కళ్లముందే కాలిపోయారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మేం ముందుకు వెళ్లలేకపోయాం. వారి పరిస్థితి చూసి మాకు కన్నీరాగలేదు’’ అని తెలిపారు. అటుగా వెళ్తున్న వాహనదారులు ఎవరూ ప్రమాదం చూసి స్పందించలేదని, లేకపోతే మరిన్ని ప్రాణాలు కాపాడగలిగే వాళ్లమని చెప్పారు మరో ప్రయాణికుడు తెలిపారు.

ఇదిలా ఉండగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఘటనాస్థలానికి చేరుకోనున్నారు. ఈ విషాదం వేళ బస్సులో 33 మంది ప్రయాణికులు ఉండగా.. 25 మంది సజీవదహనయ్యారు. మిగిలివారికి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.

సీఎం కేసీఆర్‌ సంతాపం

మహారాష్ట్ర బస్సు ప్రమాద ఘటనపై భారాస జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని