Elections: ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?

నామినేషన్‌ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.

Published : 19 Apr 2024 00:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections) మొత్తం ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి పలు ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియగా, మరికొన్నిచోట్ల ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ‘బీ ఫారం’ అనే మాట వింటుంటాం. అసలు ఇదేంటనే విషయాన్ని పరిశీలిస్తే.. ఏదైనా రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారా లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా? అనే దానిని అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాల్లో తెలియజేస్తారు. ఇందుకోసం రాజకీయ పార్టీలు ఒక ఫారాన్ని (బీ ఫారం) అభ్యర్థులకు అందిస్తారు. దాన్నిబట్టి ఒక అభ్యర్థి ఏ రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో తెలుస్తుంది.

‘ఏ’ ఫారం...

తమ పార్టీ అభ్యర్ధిగా ఒకరిని ఎంపిక చేసి అతనికి ‘బీ’ ఫారం అందించే వ్యక్తి ఇచ్చేదే ‘ఏ’ ఫారం. పార్టీ ఎవరినైతే ఎంపిక చేసి ‘ఏ’ ఫారం అందిస్తుందో ఆయనకు మాత్రమే తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధులకు ‘బీ’ ఫారం అందించే అధికారం ఉంటుంది. ‘ఏ’ ఫారం అందుకున్న పార్టీ ప్రతినిధి ముందుగా తనకు లభించిన ‘ఏ’ ఫారాన్ని ఆయా ఎన్నికల అధికారులకు అందజేస్తారు. అందులో తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను తెలియజేస్తారు. ఈ ఫారం మీద ఆ రాజకీయ పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి సంతకం ఉంటుంది. అలాగే ఆ పార్టీ ముద్ర కూడా వేయాలి.

‘బీ’ ఫారం...

గుర్తింపుపొందిన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్ధులు వీరే అంటూ పార్టీ ప్రతినిధి ఇచ్చేది ‘బీ’ ఫారం. నామినేషన్‌ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును అతనికి కేటాయిస్తారు. ఆ పార్టీ అధ్యక్షులు లేదా ప్రత్యేకంగా నియమించిన ప్రతినిధులు ఈ ఫారాన్ని అభ్యర్థికి అందజేస్తారు. బీ ఫారం ఉంటే ఆ అభ్యర్థిని ఒక రాజకీయ పార్టీ తమ అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నట్టు లెక్క. దానివల్ల గుర్తింపుపొందిన పార్టీ అయితే ఆ పార్టీకి కేటాయించిన గుర్తు మీద అతడు పోటీ చేయొచ్చు. ఎన్నికల ప్రచారంలో ఆ గుర్తు వాడుకునే అవకాశం ఉంటుంది.

మరో వ్యక్తికి ఇవ్వలేం..

బీ ఫారం ఒకరికి ఇచ్చిన తర్వాత మరో అభ్యర్థికి ఇవ్వడం కుదరదు. కానీ సాధారణంగా రాజకీయ పార్టీలు అసలు అభ్యర్థితో పాటు ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థితో కూడా నామినేషన్‌ వేయిస్తారు. ఇలాంటివారిని డమ్మీ అభ్యర్థులంటారు. నిజానికి వీరిద్దరూ ఒకే పార్టీకి చెందినవారు. ఒకవేళ అసలు అభ్యర్థి నామినేషన్‌ పత్రం ఏదైనా కారణంతో తిరస్కరించబడితే వెంటనే ప్రత్యామ్నాయ అభ్యర్థి సమర్పించిన బీ ఫారాన్ని వాడుకొనే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని