నాడు హిట్లర్‌ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్‌. కెనడీ.. వైరల్‌ అవుతున్న ఈసీ పోస్ట్‌

Adolf Lu Hitler - John F Kennedy: కొన్నేళ్ల క్రితం అడాల్ఫ్‌ హిట్లర్‌ను జాన్‌.ఎఫ్‌. కెనడీ అరెస్టు చేశారట. దీని గురించి ఈసీ తాజాగా చేసిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ఇంతకీ దీని వెనక కథేంటీ?

Published : 19 Mar 2024 16:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అదేంటీ.. నాజీ పాలకుడు, జర్మనీ నియంత అడాల్ఫ్‌ లు హిట్లర్‌ (Adolf Lu Hitler)ను అమెరికా మాజీ అధ్యక్షుడు కెనడీ (John F Kennedy) అరెస్టు చేశారా? అదెప్పుడు జరిగింది.. ఎలా సాధ్యమైంది? అనుకుంటున్నారా? 2008లో జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల వేళ వార్తల్లో వచ్చిన హెడ్‌లైన్‌ ఇది. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపింది. దీని వెనక అసలు విషయం ఏంటంటే..?

ఆ ఎన్నికల్లో ఎన్సీపీ పార్టీ తరఫున పోటీ చేసిన అడాల్ఫ్‌ లు హిట్లర్‌ కోడ్‌ ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో స్థానిక ఎస్పీ ఆయనను అరెస్టు చేశారు. ఆ పోలీసు అధికారి పేరు జాన్‌.ఎఫ్‌.కెనడీ. దీంతో మరుసటి రోజు వార్తాపత్రికల్లో ‘మేఘాలయలో హిట్లర్‌ను కెనడీ అరెస్టు చేశారు’ అంటూ కథనాలు వచ్చాయి. అప్పట్లో ఈ వార్తలు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాయి.

మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ.. గతంలో జరిగిన ఇలాంటి ఆసక్తికర సంఘటనలను కేంద్ర ఎన్నికల సంఘం (EC) సోషల్‌ మీడియాలో పంచుకుంటోంది. తాజాగా ఈ హిట్లర్‌-కెనడీ స్టోరీని పోస్ట్‌ చేయగా.. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. మరో విషయమేంటంటే.. ఈ హిట్లర్‌ పూర్తి పేరు అడాల్ఫ్‌ లు హిట్లర్‌ మారక్‌. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. గతేడాది ఆయన టీఎంసీలో చేరారు.

ఈయన పేరుపై ప్రతిసారీ వార్తలు వస్తూనే ఉంటాయి. ‘హిట్లర్‌ మళ్లీ మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు’ అంటూ 2013లో అంతర్జాతీయ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. దీనిపై ఇటీవల ఆయన ఓ సందర్భంలో స్పందిస్తూ.. ‘‘హిట్లర్‌ పేరు మా అమ్మానాన్నలకు నచ్చి నాకు పెట్టి ఉంటారు. దీంతో నేను సంతోషంగానే ఉన్నా. కానీ, నాలో ఎలాంటి నియంత లక్షణాల్లేవు’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని