Siddaramaiah: నేనూ ప్రేమలో పడ్డాను.. కానీ కులం అడ్డొచ్చింది: సిద్ధరామయ్య

బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని ఆ వేడుకల్లో భాగంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొని ప్రసంగించారు.

Published : 26 May 2024 00:05 IST

బెంగళూరు: మైసూరులో బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) పాల్గొన్నారు. కులాంతర వివాహాల విషయంపై ఆయన మాట్లాడుతూ చదువుకునే రోజుల్లో తానూ ప్రేమలో పడ్డానని, కాని కులం వేరే అవ్వడం వల్ల ప్రేమను వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తాను వివాహం చేసుకుంటానని అడిగినప్పుడు వారి కుటుంబసభ్యులతో పాటు ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదన్నారు. దానికి కారణం తాను వేరే కులానికి చెందిన వాడినవడమేనని పేర్కొన్నారు. దీంతో మరో ఆలోచన లేకుండా తమ వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లాడానని చెప్పుకొచ్చారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ కులాంతర వివాహాలు చేసుకునే వారికి తమ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని, అవసరమైన సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో కుల నిర్మూలన కోసం ఎందరో సంఘ సంస్కర్తలు కృషి చేసినప్పటికీ సమానత్వం రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిని నిర్మూలించాలంటే రెండే మార్గాలు ఉన్నాయన్నారు. ఒకటి కులాంతర వివాహం, మరొకటి అన్ని వర్గాలు సామాజిక, ఆర్థిక అభివృద్ధిని సాధించడం అని ఆయన అన్నారు. ఆర్థిక అభ్యున్నతి లేని సమాజంలో సామాజిక సమానత్వం ఎప్పటికీ సాధ్యం కాదని సిద్ధరామయ్య అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని