పార్లమెంట్‌ వేదికగా వైట్‌ పేపర్‌- బ్లాక్‌ పేపర్ ఫైట్‌..!

దేశ ఆర్థిక స్థితిగతులపై అధికార, విపక్ష పార్టీలు నేడు పార్లమెంట్‌(Parliament)లో వైట్‌, బ్లాక్‌ పేపర్లను సమర్పించనున్నాయి. 

Updated : 08 Feb 2024 11:09 IST

దిల్లీ: తన పదేళ్ల పాలనపై కేంద్రంలోని అధికార భాజపా గురువారం ‘వైట్‌పేపర్‌’ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుండగా.. కాంగ్రెస్‌ ‘బ్లాక్‌ పేపర్‌’తో కౌంటర్ ఇవ్వనుంది. ఫిబ్రవరి 1న తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ (Nirmala Sitharaman) ఈ శ్వేతపత్రాన్ని సమర్పిస్తామని వెల్లడించారు. 2014 ముందు వరకు, ఆ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి మధ్య తేడాను వెల్లడించే ఉద్దేశంతో దానిని పార్లమెంట్‌ (Parliament)లో ఉభయ సభల ముందు ఉంచుతామన్నారు. దాని ద్వారా గత పాలనలో లోపాలను ఎత్తిచూపడమే తమ లక్ష్యమని చెప్పారు.  

ఆర్థిక వ్యవహారాలపై స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌, భాజపా నేత జయంత్ సిన్హా బుధవారం మాట్లాడుతూ.. ‘యూపీఏ కాలంలో ఐదు బలహీన ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా ఉండేది. వృద్ధి రేటు నెమ్మదించి  5 శాతానికి పడిపోయింది. ద్రవ్యోల్బణం 10 శాతానికి పెరిగింది. బ్యాంకుల ఎన్‌పీఏలు 10 శాతానికి ఎగబాకాయి. ఆ సమస్యలను ఎలా పరిష్కరించామో శ్వేతపత్రంలో స్పష్టత ఇవ్వనున్నాం’ అని వెల్లడించారు. దీనికి సమాధానంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బ్లాక్‌ పేపర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. అలాగే బుధవారం పార్లమెంట్‌ వేదికగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై ఖర్గే విమర్శలు చేశారు. ‘ఈ పదేళ్లపాటు మోదీ కాంగ్రెస్‌ను నిందిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థిక అసమానతల గురించి మాట్లాడటం లేదు. అబద్ధాలు ప్రచారం చేయడమే మోదీ గ్యారంటీ’ అని దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు