Payal Dhare: మోదీతో ‘గేమ్‌’.. నెటిజన్లు శోధిస్తున్న ఆ సొట్ట బుగ్గల సుందరి ఎవరు..?

ప్రధాని మోదీ (Modi) ఇటీవల గేమింగ్ ఇండస్ట్రీకి చెందిన కొందరితో సమావేశమయ్యారు. వారిలో ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. 

Published : 13 Apr 2024 16:39 IST

దిల్లీ: ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్‌తో పాపులారిటీ సంపాదించిన కొంతమంది గేమర్ల (gamers)తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఇటీవల ముచ్చటించిన సంగతి తెలిసిందే. వారితో ప్రధాని సంభాషణకు సంబంధించిన పూర్తి వీడియో ఈ రోజు విడుదలైంది. వారంతా గేమింగ్ ఇండస్ట్రీ భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నారు. అలాగే మన పురాణాల ఆధారంగా గేమ్స్ రూపకల్పన గురించి, ఈ రంగంలో కెరీర్‌ ఎంచుకుంటున్నవారు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చర్చించుకున్నారు. అయితే ఈ సమయంలో ఓ అమ్మాయి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆ సొట్ట బుగ్గల సుందరి ఎవరా అని వెతకడం ప్రారంభించారు. ఆమే పాయల్‌ ధరె (Payal Dhare).

వివిధ రాష్ట్రాలకు చెందిన తీర్థ్‌ మెహతా, అనిమేశ్‌ అగర్వాల్‌, అన్షు బిష్త్‌, నమన్‌ మథుర్‌, మిథిలేశ్‌ పటాంకర్‌, గణేశ్ గంగాధర్‌తో పాటు పాయల్‌ (Payal Dhare) కూడా మీటింగ్‌లో పాల్గొన్నారు. ఆమెది మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడాకు చెందిన ఉమ్రానాలా గ్రామం. ‘పాయల్ గేమింగ్’తో పాపులర్ అయ్యారు. దేశంలోని మహిళా గేమ్ క్రియేటర్లలో ఆమె ఒకరు. 

మోదీతో మీటింగ్‌ గురించి పాయల్‌ తండ్రి శివశంకర్ ధరెను మీడియా పలకరించింది. ‘‘ ప్రధానితో సమావేశానికి నా కుమార్తెకు పిలుపు వచ్చిందని తెలియగానే ఎంతో సంతోషం కలిగింది. అంతేగాకుండా ఆయనతో కూర్చొని గేమ్ ఆడటం అనేది ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. పాయల్ మన ఊరుకు ఎంతో పేరు తెచ్చిందని ఇప్పుడు అందరూ అంటుంటే ఎంతో గర్వంగా అనిపిస్తోంది’’ అని ఆయన ఆనందం వ్యక్తంచేశారు.

ఈ ఏడాది మార్చిలో ఆమె ‘గేమింగ్ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నారు. గత ఏడాది ‘డైనమిక్ గేమింగ్ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం వరించింది. అంతేగాకుండా ‘ఫిమేల్‌ స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్‌ను దక్కించుకున్నారు. మోదీతో దిగిన చిత్రాన్ని ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆమె.. ‘‘ప్రధానితో కలిసి గేమింగ్ ఇండస్ట్రీ ప్యూచర్ గురించి చర్చించడం గర్వంగా అనిపించింది. దేశం కోసం ఏదైనా చేయాలనే ఆయన సంకల్పం ఎంతో గొప్పది’’ అని కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని