Prabhakar Chaudhary: ప్రభాకర్‌ చౌదరి ఐపీఎస్‌.. 8 ఏళ్లలో 18 బదిలీలు

ఉత్తర్‌ప్రదేశ్‌లో కన్వారియాలపై లాఠీఛార్జికి అనుమతిచ్చిన ఎస్పీ ప్రభాకర్‌ చౌదరిని రాత్రికి రాత్రి బదిలీ చేశారు. ఇంతకీ ఎవరీ ప్రభాకర్‌.. అతడి ప్రత్యేకత ఏంటి?

Updated : 31 Jul 2023 16:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో అనధికార మార్గంలో ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించిన కన్వారియాల గుంపుపై ( కావడి యాత్రికులు) లాఠీ ఛార్జీకి అనుమతిచ్చిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌ చౌదరిని (Prabhakar Chaudhary) అక్కడి ప్రభుత్వం రాత్రికి రాత్రి బదిలీ చేసింది. అందులో వింతేముంది అనుకుంటున్నారా? గడిచిన ఎనిమిదేళ్లలో ఆయనకిది 18వ బదిలీ. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆదివారం కొందరు కన్వారియాలు బరేలి జిల్లా మీదుగా కావడియాత్ర నిర్వహించారు. అయితే దీనికోసం ఎలాంటి అనుమతులు తీసుకోలేదు సరికదా.. సున్నిత ప్రాంతమైన జోగి నడవా గుండా ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. కన్వారియాలు పోలీసులకు వ్యతిరేకంగా, మరో వర్గాన్ని కించపరిచేలా నినాదాలు చేశారు. దాదాపు ఆరు గంటలు గడుస్తున్నా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రభాకర్‌ చౌదరి అనుమతితో పోలీసులు లాఠీఛార్జి చేసి గుంపును చెదరగొట్టారు. దీంతో అనుమతిచ్చిన ఎస్పీ ప్రభాకర్‌ చౌదరిని ఉన్నతాధికారులు లఖ్‌నవూ కేంద్రంగా పని చేస్తున్న 32వ ప్రావిన్షియల్‌ ఆర్మ్‌డ్‌ కానిస్టేబులరీ బెటాలియన్‌కు బదిలీ చేశారు.

ఎవరీ ప్రభాకర్‌ చౌదరి?

ప్రభాకర్‌ చౌదరికి బదిలీలు కొత్తేం కాదు.. యూపీకి చెందిన ఈ ఐపీఎస్‌.. గడిచిన 8 ఏళ్లలో 18 సార్లు వివిధ ప్రాంతాలకు ఆయన బదిలీపై వెళ్లారు. 2010 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఈయన.. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ట్రైనీ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏఎస్‌పీ)గా నోయిడాలో తొలిసారి విధుల్లో చేరారు. బాలియ, బులంద్‌శహర్‌, మేరట్‌, వారణాశి, కాన్పూర్‌ తదితర కీలక జిల్లాల్లో సేవలు అందించారు. 2016లో కన్పూర్‌ దేహత్‌ ఎస్పీగా పదోన్నతి పొందారు. విధి నిర్వహణలో ఈయన వ్యవహారశైలి కూడా భిన్నంగా ఉంటుంది. అందరి అధికారుల్లా కాకుండా అప్పుడప్పుడు బస్సులు, టెంపోల్లోనే కార్యాలయానికి వెళ్లేవారు. అప్పట్లో కాన్పూర్‌లో ఓ రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి.. బాధితులను తన సొంత వాహనంలో ఆస్పత్రికి తరలించి వార్తల్లోకెక్కారు.

3 నెలలకే ట్రాన్స్‌ఫర్‌

2017లో కాన్పూర్‌ నుంచి బదిలీ అయి.. మధుర జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. రోజుల వ్యవధిలోనే మాఫియా, రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపారు. అక్రమంగా బంగారు, వెండి వ్యాపారం చేస్తున్న వారిని కటకటాల్లోకి నెట్టారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో కేవలం మూడు నెలల్లోనే అతడిని అక్కడి నుంచి ఉన్నతాధికారులు బదిలీ చేశారు. జూన్‌ 30, 2018న సీతాపుర్‌ ఎస్పీగా ప్రభాకర్‌ బాధ్యతలు చేపట్టారు. వివిధ కారణాలతో 6 నెలలకే మళ్లీ బదిలీ అయ్యారు.

అంజూ పెళ్లి ఓ అంతర్జాతీయ కుట్ర.. మధ్యప్రదేశ్‌ మంత్రి వ్యాఖ్యలు

2019లో సోన్‌భద్ర జిల్లాలో చోటు చేసుకున్న భూ తగాదాల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా 28 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అప్పట్లో ఈ ఘటన యూపీ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో అప్పటి ఎస్పీ సల్మాన్‌తేజ్‌ పాటిల్‌ను తొలగించి.. అతడి స్థానంలో ప్రభాకర్‌ చౌదరికి బాధ్యతలు అప్పగించారు. ఇలా ఒకటి కాదు.. రెండుకాదు.. 8 ఏళ్లలో వివిధ కారణాలతో 18 సార్లు ఆయన బదిలీ అయినట్లు పోలీస్‌ రికార్డులు చెబుతున్నాయి. ఉన్నత స్థానంలో ఉన్నా.. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రభాకర్‌ వెనుకాడేవారు కాదు. ఓసారి సైకిల్‌ పోయిందని తానే నేరుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించారు. ప్రభాకర్‌ చౌదరని త్వరలో డెప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని