Sheikh Shahjahan: సందేశ్‌ఖాలీలో అకృత్యాలు.. ఎవరీ షాజహాన్‌ షేక్‌..?

Shahjahan Sheikh: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణల్లో ప్రధాన నిందితుడైన టీఎంసీ నేత షాజహాన్‌ షేక్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకీ ఎవరాయన?

Updated : 29 Feb 2024 15:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సందేశ్‌ఖాలీ.. పశ్చిమబెంగాల్‌ (West Bengal)లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సుందర్బన్‌ అడవుల్లో ఉందీ ప్రాంతం. అంతకుముందు పెద్దగా ఎవరికీ పరిచయం లేని ఈ పేరు.. గత కొన్ని రోజులుగా వార్తల్లో మార్మోగుతోంది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) నేత షాజహాన్‌ షేక్‌, అతడి అనుచరులు తమపై అకృత్యాలకు పాల్పడుతున్నారంటూ ఇక్కడి మహిళలు రోడ్డెక్కారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులో ఎట్టకేలకు ఆ నేతను పోలీసులు అరెస్టు చేశారు. 

కూలీ నుంచి రాజకీయ నేతగా..?

45 ఏళ్ల షాజహాన్‌ (Shahjahan Sheikh) సందేశ్‌ఖాలీలో బలమైన నేత. ప్రస్తుతం ఈ ప్రాంత టీఎంసీ విభాగ అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. స్థానికంగా ఎంపీ, ఎమ్మెల్యే కంటే బాగా పాపులర్‌. 1999లో కూలీగా, కూరగాయల విక్రేతగా చిన్నచిన్న పనులు చేసుకుంటుండేవారు. ఆయన మామ మొస్లేమ్‌ షేక్‌ సీపీఎం నుంచి పంచాయత్‌ ప్రధాన్‌గా పని చేశారు. ఆయన అండతో 2003లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన షాజహాన్‌.. ఉత్తర 24 పరగణాల జిల్లాలో కీలక నేతగా ఎదిగారు.

2009 తర్వాత నుంచి రాష్ట్రంలో సీపీఎం వరుసగా ఓటమి పాలవుతున్నా.. ఈ ప్రాంతంలో మాత్రం షాజహాన్‌, ఆయన మామ పలుకుబడి మాత్రం తగ్గలేదు. ప్రభుత్వ పదవుల్లో కొనసాగుతూనే అనేక దందాలు, వ్యాపారాలు చేసేవారు. తన సిండికేట్లలో స్థానిక యువతకు ఉద్యోగాలిచ్చి వారిని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలప్పుడు స్థానికులకు ఆర్థికంగా సాయం చేసి పాపులారిటీ దక్కించుకున్నారు.

2013లో టీఎంసీ పార్టీలో చేరిన షాజహాన్‌.. మాజీ మంత్రి జ్యోతిప్రియో మాలిక్‌కు దగ్గరయ్యారు. పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేల కంటే ఈయనే బలమైన నేత అని కార్యకర్తలు చెబుతుంటారు. రేషన్‌ కుంభకోణంలో మాలిక్‌ అరెస్టైన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఇటీవల ఈడీ అధికారులు షాజహాన్‌ ఇంటికి తనిఖీలకు వెళ్లగా వారిపై తన అనుచరులతో దాడి చేయించారు. ఆ తర్వాత నుంచి కన్పించకుండా పోయారు.

సందేశ్‌ఖాలీ దుమారంతో..

సందేశ్‌ఖాలీలో దశాబ్దాల పాటు బలమైన నేతగా ఎదిగిన షాజహాన్‌.. అక్కడి ప్రజలను శాసించడం మొదలుపెట్టారు. స్థానికుల నుంచి భూములను లాక్కోవడం, ఇవ్వని పక్షంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటం వంటి ఆరోపణలు వచ్చాయి. రాజకీయంగా అతడి పలుకుబడి చూసి ఆయనపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. అయితే, ఇటీవల ఈడీ దాడుల అనంతరం కొంతమంది మహిళలు షాజహాన్‌ను అరెస్టు చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు. దీంతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఇదికాస్తా దుమారం రేపడంతో కలకత్తా హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

రైతుల నుంచి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకొని చేపల చెరువులు ఏర్పాటుచేయడం, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆయనపై పలు అభియోగాలు ఉన్నాయి. దీంతో పాటు మరిన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. ఇన్ని ఆరోపణలు వచ్చినా తృణమూల్‌ నాయకత్వం పెద్దగా స్పందించలేదు. చివరకు హైకోర్టు, గవర్నర్‌ ఆదేశాలతో అరెస్టు చేశారు. ఇన్నాళ్లు పోలీసుల దగ్గర ఆశ్రయం పొందినట్టు భాజపా ఆరోపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని