‘ఆ దగ్గు మందు కలుషితం.’. భారత్‌లో తయారైన సిరప్‌పై WHO అలర్ట్‌!

WHO on Indian made cough syrup: భారత్‌లో తయారైన ఓ దగ్గు మందు కలుషితమైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. పశ్చిమ పసిఫిక్‌ దేశాల్లో ఈ మందులను గుర్తించినట్లు తెలిపింది.

Published : 25 Apr 2023 20:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో ఓ కంపెనీ తయారు చేసిన దగ్గు మందు కలుషితమైనట్లు తాము గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. పశ్చిమ పసిఫిక్‌ దేశాలైన మార్షల్ దీవులు, మైక్రోనేషియాలో ఈ కలుషిత దగ్గు మందులు గుర్తించినట్లు పేర్కొంది. వివిధ దేశాల్లో చిన్నారుల మరణాలకు భారత్‌లో తయారైన దగ్గు మందులు కారణమైన నేపథ్యంలో అలాంటి వ్యవహారమే తెరపైకి రావడం గమనార్హం. అయితే, ఆయా చోట్ల ఈ దగ్గు మందు కారణంగా ఎవరైనా చిన్నారులు అనారోగ్యం బారిన పడ్డారా? లేదా? అన్న వివరాలు మాత్రం డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించలేదు.

పంజాబ్‌కు చెందిన క్యూపీ ఫార్మాకెమ్‌ లిమిటెడ్‌ తయారు చేసిన ఈ దగ్గు మందులో పరిమితికి మించి డైథిలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్‌తో ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ తన ప్రకటనలో పేర్కొంది. ఈ దగ్గు మందును హరియాణాకు చెందిన థ్రిల్లియం ఫార్మా మార్కెటింగ్‌ చేస్తోందని పేర్కొంది. ఇవి తీసుకుంటే ప్రమాదమని, మరణానికి కూడా దారితీయొచ్చని హెచ్చరించింది. దిగుమతైన దగ్గు మందుల్లో ఓ బ్యాచ్‌లోని శాంపిళ్లను ఏప్రిల్‌ 6న పరిశీలించగా ఈ కలుషిత ఆనవాళ్లు గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటన నేపథ్యంలో క్యూపీ ఫార్మాకెమ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మంగళవారం స్పందించారు. భారత ప్రభుత్వ అనుమతితో 18వేల సిరప్‌ బాటిళ్లను కంబోడియాకు ఎగుమతి చేసినట్లు చెప్పారు. భారత్‌లోనూ ఈ సిరప్‌ను పంపిణీ చేశామని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులూ రాలేదని పేర్కొన్నారు. పంపిణీ సంస్థ థ్రిల్లియం ఫార్మా మాత్రం దీనిపై స్పందించలేదు. అయితే ఈ దగ్గు మందుకు సంబంధించి అటు క్యూపీ ఫార్మా గానీ, థ్రిల్లియం గానీ భద్రత, నాణ్యతకు సంబంధించి ఎలాంటి గ్యారెంటీ తమకు సమర్పించలేదని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

2022లో గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్‌ వంటి దేశాల్లో భారత్‌లో తయారైన కలుషిత దగ్గు మందు తీసుకోవడం వల్ల దాదాపు 300 మంది చిన్నారులు మరణించారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ అప్రమత్తమైంది. సత్వర చర్యలకు ఈ ఏడాది జనవరిలో ఆదేశించింది. దీనిపై భారత ప్రభుత్వం కూడా ఆగమేఘాల మీద చర్యలకు పూనుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో కలుషిత దగ్గు మందు వ్యవహారం బయటపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని