Lok Sabha Speaker: మంత్రివర్గం ఓకే.. ఇంతకీ లోక్‌సభ స్పీకర్‌ ఎవరు..?

Lok Sabha Speaker: కేంద్రమంత్రివర్గంపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో స్పీకర్‌ పదవి ఎవరు చేపడతారన్న చర్చ మొదలైంది.

Updated : 10 Jun 2024 18:10 IST

Lok Sabha Speaker | దిల్లీ: కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని సహా మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తయ్యింది. ఇక మిగిలింది స్పీకర్‌ (Lok Sabha Speaker) పదవే. గతంలో రెండుసార్లూ భాజపాకు పూర్తి మెజారిటీ రావడంతో ఆ పార్టీ వ్యక్తులనే స్పీకర్‌ పదవి వరించింది. ఈసారి పూర్తి మెజారిటీ రాకపోవడంతో భాగస్వామ్య పక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. మరి స్పీకర్‌ పదవిని భాజపానే అట్టిపెట్టుకుంటుందా? మిత్రులకు కేటాయిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

చట్టాలు రూపుదిద్దుకునే పార్లమెంట్‌ ఉభయసభల్లో లోక్‌సభది కీలక పాత్ర. దీన్ని నడపడం స్పీకర్‌ విధి. అధికార, విపక్ష సభ్యులతో కూడిన ఈ సభను సజావుగా నడపడం అంత సులువేం కాదు. ఈ పోస్టులో ఉన్నవారు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గతంలో స్పీకర్‌గా ఎన్నికైనవారు తమతమ పార్టీలకు రాజీనామా చేసేవారు. తర్వాత కాలంలో ఆ సంప్రదాయానికి తెరపడింది. అవిశ్వాస తీర్మానం, పార్టీ ఫిరాయింపులు, కీలక బిల్లులు గట్టెక్కడం వంటి విషయాల్లో స్పీకర్‌ది కీలకపాత్ర. అందుకే ఇప్పుడు దృష్టంతా ఆ పోస్టుపై పడింది.

తెలంగాణ భాజపా అధ్యక్షుడిగా ఈటల రాజేందర్?

లోక్‌సభ రద్దయినా స్పీకర్‌ పదవి ఖాళీ అయ్యేది మాత్రం కొత్త ఎంపీల ప్రమాణస్వీకారానికి ముందే. వారి చేత ప్రొటెమ్‌ స్పీకర్‌ ప్రమాణం చేయిస్తారు. ఈ సారి ఆ అవకాశం కేరళకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కొడికున్నిల్‌ సురేశ్‌ లేదా మధ్యప్రదేశ్‌కు చెందిన భాజపా సీనియర్‌ నేత వీరేంద్ర కుమార్‌కు దక్కే అవకాశం ఉంది. వీరు 8 సార్లు చొప్పున దిగువ సభకు ఎన్నికయ్యారు. క్రితం సారి వీరేంద్ర కుమారే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. ప్రమాణ స్వీకారం తర్వాత సాధారణ మెజారిటీతో సభ్యులు స్పీకర్‌ను ఎన్నుకుంటారు. అంటే అధికార పక్షానికి స్పీకర్‌ పదవికి దక్కడం లాంఛనం కానుంది.

పురందేశ్వరికి ఛాన్స్‌..?

మోదీ 3.0 ప్రభుత్వ ఏర్పాటులో తెదేపా, జేడీయూ కీలకంగా మారాయి. దీంతో ఈ రెండు పార్టీలూ స్పీకర్ పదవిని ఆశించినట్లు వార్తలు వచ్చాయి. ఇండియా కూటమి పార్టీలు సైతం స్పీకర్‌ పోస్టుకు పట్టుబట్టాలని వీరిపై ఒత్తిడి తేవడం విశేషం. అయితే, కేంద్రమంత్రివర్గంలో హోం, రక్షణ, ఆర్థికశాఖలతో పాటు స్పీకర్‌ పదవిని తనవద్దే అట్టిపెట్టుకోవాలని భాజపా వైఖరిగా ఉంది. దీంతో ఇతర పార్టీలకు స్పీకర్‌ పదవి చేపట్టే అవకాశం దాదాపు లేనట్లే. అలాంటి పక్షంలో రాజస్థాన్‌ కోటా స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇవ్వొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి పేరు కూడా ప్రచారంలో ఉంది. వీరిద్దరూ కాకుండా అనూహ్యంగా వేరెవరి పేరైనా తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. జూన్‌ 18న లోక్‌సభ తొలిసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. దీంతో జూన్‌ 20కల్లా స్పీకర్‌ పోస్ట్‌పై స్పష్టత రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు