Brij Bhushan Sharan Singh: ఎస్పీకే తుపాకీ గురిపెట్టిన ఘనుడు.. పార్టీ ఏదైనా హవా బ్రిజ్‌భూషణ్‌దే..!

భారత రెజ్లర్లు ఈ సారి ఓ ఉత్తరప్రదేశ్‌ బాహుబలితో తలపడ్డారు. ఆ బాహుబలి సామాన్యుడు కాదు.. అతడి నేరాల చిట్టా చాలా పెద్దది.    

Published : 25 Apr 2023 15:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఎస్పీకే తుపాకీ గురిపెట్టి బెదిరించిన ఘనుడు.. అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌తో సంబంధాలున్నాయన్న ప్రచారం.. బాబ్రీ ఘటనలో హస్తముందన్న ఆరోపణలు ఇలా చెప్పుకొంటూ పోతే యూపీ నేత బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ వివాదాల చిట్టా చాలా పెద్దది. యూపీలో నేర సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఈ నాయకుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఏకంగా ఒలింపిక్‌ పతక విజేతలైన రెజ్లర్లు రోడ్డెక్కారు. వారి ఆందోళన రోజుల తరబడి సాగుతోంది. అయినా పోలీసులు సదరు నాయకుడిపై కనీసం కేసు కూడా పెట్టలేదు.. తాజాగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

బ్రిజ్‌భూషణ్‌ ఉత్తరప్రదేశ్‌లో అతిపెద్ద బాహుబలి నేతల్లో ఒకడిగా పేరున్న వ్యక్తి. ఎంపీగా ఏకంగా ఆరుసార్లు పార్లమెంట్‌లో అడుగుపెట్టిన నాయకుడు. ఇతడిపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నా రకరకాల రాజ్యంగ పదవులను అనుభవిస్తున్నాడు. భారీ ఎత్తున విద్యాసంస్థలు, అఖాడాలు నిర్వహిస్తూ యువతలో పాపులారిటీ సంపాదించాడు. యూపీలోని గోండా చుట్టుపక్కల అరడజను జిల్లాలో బ్రిజ్‌భూషణ్‌ హవా కనపడుతుంది.

ఎస్పీకే పిస్తోల్‌ గురిపెట్టి..

బ్రిజ్‌భూషణ్‌ 1957లో బిష్ణోపూర్‌ గ్రామంలోని కాంగ్రెస్‌ నాయకుడు జగదాంబ శరణ్‌ సింగ్‌ కుటుంబంలో జన్మించాడు. అతడు జన్మించిన గ్రామం అయోధ్యకు అత్యంత సమీపంలో ఉంటుంది. అక్కడి సాకేత్‌ డిగ్రీ కళాశాలలో చదువుతుండగానే విద్యార్థి సంఘ కార్యదర్శిగా ఎన్నికై రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ తర్వాత ప్రభుత్వ కాంట్రాక్టులు చేయడం మొదలుపెట్టాడు. అతడు స్థానిక కాంగ్రెస్‌ నాయకుడు రాజా ఆనంద్‌సింగ్‌కు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా చెరకు సహకార సంఘ ఎన్నికల్లో నామినేషన్‌ వేశాడు. ఆ సమయంలో జిల్లా ఎస్పీ బ్రిజ్‌భూషణ్‌ను పిలిపించి నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని సూచించాడు. ఈ క్రమంలో వాగ్వాదం పెరిగి తన తుపాకీ తీసి నేరుగా ఎస్పీకి గురిపెట్టి నోటికొచ్చినట్లు తిట్టాడు. అనంతరం అక్కడి నుంచి బైక్‌పై తిరిగి వచ్చేశాడు. ఈ విషయాన్ని బ్రిజ్‌భూషణ్‌ గొప్పగా చెప్పుకొంటాడు.

దావూద్‌తో సంబంధాలపై ఆరోపణలు..

సీబీఐ రికార్డుల్లో బ్రిజ్‌భూషణ్‌కు దావూద్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. 1992లో ముంబయిలో అరుణ్‌ గావ్లీ గ్యాంగ్‌కు చెందిన శైలేష్‌ హల్డాంకర్‌ జేజే హాస్పిటల్‌ వార్డ్‌ నంబర్‌ 18లో ఉండగా.. కొందరు దుండగులు 500 తూటాలు కాల్చి మరీ చంపారు. దావూద్‌ సోదరుడి హత్యకు ప్రతీకారంగా ఈ దాడి జరిగినట్లు అనుమానాలున్నాయి. ఈ కేసులోని హంతకులకు బ్రిజ్‌భూషణ్‌ ఆశ్రయం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత మూడు నెలలకు బాబ్రీ మసీదు కూల్చివేతలో కూడా ఇతడి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. ఈ కేసులోని మొత్తం 49 నిందితుల్లో బ్రిజ్‌ కూడా ఒకడు. తర్వాత ఆ రెండు కేసుల నుంచి బయటపడ్డాడు. దావూద్‌తో సంబంధాల కేసులో 1996లో టాడా చట్టం కింద జైల్లో ఉన్న సమయంలో భాజపా నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఇతడికి లేఖ రాశారు. ధైర్యం కోల్పోవద్దని ఆ లేఖలో పేర్కొన్నట్లు కథనాలు వచ్చాయి. అదే ఏడాది ఈయన భార్య కేతకి దేవికి భాజపా టిక్కెట్‌ ఇవ్వగా 70,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

సొంతపార్టీ ఎంపీ అభ్యర్థిని చంపించినట్లు ఆరోపణలు..

1999లో బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ గోండా నుంచి ఎంపీగా విజయం సాధించాడు. అప్పట్లో ఆర్‌ఎస్ఎస్‌ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్‌తో ఈయనకు విభేదాలు ఏర్పడ్డాయి. గోండా నియోజకవర్గం పేరును జయప్రకాశ్‌ నగర్‌గా మార్చడానికి నానాజీ మద్దతు ఉంది. దీనికి వ్యతిరేకంగా బ్రిజ్‌భూషణ్‌ భారీ ఆందోళన చేపట్టాడు. మరోవైపు కేంద్రంలోని భాజపా కూడా 2004 ఎన్నికలకు బ్రిజ్‌భూషణ్‌ను బల్‌రాంపూర్‌ నియోజకవర్గానికి మార్చింది. ఇది అతడికి నచ్చలేదు. 

గోండా అభ్యర్థిత్వాన్ని వాజ్‌పేయీ బంధువు ఘనశ్యామ్‌ శుక్లాకు ఇచ్చారు. శుక్లా అప్పటికే అక్కడ ఎమ్మెల్యే. 2004 గోండాలో పోలింగ్‌ జరుగుతుండగానే ఓ రోడ్డు ప్రమాదంలో శుక్లా మృతి చెందాడు. ఇది బ్రిజ్‌భూషణ్‌ చేయించిన హత్యగా ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో వాజ్‌పేయీ తనకు ఫోన్‌ చేసి ‘‘నువ్వు అతడిని చంపేశావు’’ అని అన్నట్లు బ్రిజ్‌భూషణ్‌ ఓ సందర్భంలో వెల్లడించినట్లు కథనాలు వచ్చాయి. ఈ వివాదం నేపథ్యంలోనే 2009లో భాజపాను వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరి కైసర్‌గంజ్‌లో ఎంపీగా గెలిచాడు. ఆ తర్వాత మళ్లీ భాజపాలో చేరి ఇదే సీటు నుంచి 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించాడు. 

రాజకీయాలు.. రెజ్లింగ్‌పై ఉడుంపట్టు..

ఓ వైపు రాజకీయాల్లో ఎదుగుతూనే మరోవైపు రెజ్లింగ్‌ సమాఖ్యపై కూడా పట్టసాధించాడు. మెల్లగా పెద్ద పోటీలను నిర్వహించడం మొదలుపెట్టాడు. అనంతరం యూపీ రెజ్లింగ్‌ అసోసియేషన్‌లో చేరాడు. ఆ తర్వాత జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్యలోకి వచ్చాడు. 2011లో డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మూడు సార్లు ఆ పదవి చేపట్టాడు. అతడి కుటుంబ సభ్యులను కూడా రెజ్లింగ్‌ సమాఖ్య రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌ డబ్ల్యూఎఫ్‌ఐ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. మరో కుమారుడు ప్రతీక్‌.. గోండా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అల్లుడు బిహార్‌ రెజ్లింగ్‌ అసోసియేషన్‌ ఆఫీస్‌ బేరర్‌. బ్రిజ్‌భూషణ్‌ భార్య కేతకి జిల్లా పంచాయత్‌ అధ్యక్షురాలు. యూపీలోని కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను శాసించే స్థితిలో బ్రిజ్‌భూషణ్‌ ఉన్నాడు. దీంతో అతడిపై చర్యల విషయంలో పార్టీలు ముందడుగు వేయలేకపోతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని