Supreme Court: కోటాలోనే విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు?.. ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీం

Eenadu icon
By National News Team Published : 23 May 2025 16:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజస్థాన్‌లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. కోటాలోనే ఇవి ఎందుకు చోటుచేసుకుంటున్నాయంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ఏడాది ఇప్పటికే 14 మంది విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేస్తున్నారంటూ నిలదీసింది. కోటా, ఐఐటీ ఖరగ్‌పుర్‌లకు చెందిన ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యల కేసులను విచారించిన జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ల ధర్మాసనం.. ఎఫ్‌ఐఆర్‌ నమోదులో పోలీసుల వైఖరిని తప్పుపట్టింది.

ఐఐటీ ఖరగ్‌పుర్‌కు చెందిన విద్యార్థి (22) ఆత్మహత్యకు సంబంధించిన కేసును సుప్రీం విచారించింది. మే 4న హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని మరణించగా.. పోలీసులు మాత్రం మే 8న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేసు నమోదుకు నాలుగు రోజులు ఆలస్యం ఎందుకు అయ్యిందని సంబంధిత పోలీసు అధికారిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులను తేలికగా తీసుకోవద్దని, చాలా తీవ్రత కలిగిన అంశాలని పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు సంబంధించి మార్చి 24న ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన న్యాయస్థానం.. ఇటువంటి కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ త్వరగా నమోదుచేయడం ఎంతో ముఖ్యమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పోలీసు అధికారి, ఐఐటీ ఖరగ్‌పుర్‌ తరఫు న్యాయవాది ఇచ్చిన వివరణలపై సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది.

కోటాలో నీట్‌ (NEET)కు సన్నద్ధమవుతోన్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తున్నారని, ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదని నిలదీసింది. సంబంధిత పోలీసు అధికారి విధి నిర్వహణలో విఫలమయ్యారని, కోర్టు ఆదేశాలను ఆయన పాటించలేదని పేర్కొంది. దీనిపై జులై 14 సదరు పోలీసు అధికారి హాజరై వివరణ ఇవ్వాలని సమన్లు జారీచేసింది. ‘‘రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేస్తున్నారు? కోటాలోనే విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఈ విషయంపై ఎందుకు ఆలోచించడం లేదు? అని రాజస్థాన్‌ ప్రభుత్వం తరఫు న్యాయవాదిని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు న్యాయవాది బదులిస్తూ.. ఆత్మహత్యల కేసులను పరిశీలించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు