Dolly: కార్పొరేట్‌ కొలువు వదులుకొని.. సర్పంచ్‌గా పోటీ చేసి..!

ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగాన్ని వదులుకొని సర్పంచ్‌గా పోటీ చేశారు బిహార్‌కి చెందిన డాలీ. ఆమె ఎంత వరకు అందులో సక్సెస్‌ సాధించారు?

Published : 17 Jan 2023 01:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగం. సమున్నత హోదా. మంచి జీతం. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పని. వారాంతాల్లో వినోదాలు, విహారాలు. ఇలాంటి జీవితాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి. కానీ, ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం వదులుకొని ప్రజల కోసం పని చేస్తున్నారు బిహార్‌కు (Bihar)చెందిన డాలీ (Dolly).

డాలీ.. ఎంబీఏ (MBA) చదువుకున్నారు. దాదాపు 10 ఏళ్లపాటు మల్టీనేషనల్‌ కంపెనీ (MultiNational Compenie)ల్లో పని చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాగుతున్నా ఆమెకు ఏదో లోటు. ప్రజలకు ఏదో చేయాలన్న తపన. దీంతో దిల్లీ నుంచి 2018లో తన అత్తవారి ఊరు బిహార్‌లోని షాదీపూర్‌ వెళ్లారు. అదే ఏడాది జరుగుతున్న పంచాయతీ ఉప ఎన్నికల్లో సర్పంచ్‌ (Sarpanch)గా పోటీ చేశారు.  అంతవరకు బాగానే ఉంది. ఆమెను నమ్మి ఓట్లేసేదెవరు? ముక్కూమొహం తెలియదు. వాళ్ల ఆచార సంప్రదాయాలపై అవగాహన లేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లో పుట్టి పెరిగి,  బిహార్‌ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత దిల్లీకి మకాం మార్చారు. దీంతో సొంత ఊరి ప్రజలతో పరిచయాలు లేవు. అలాంటి వ్యక్తికి అక్కడి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారు? ఇదే సందేహం ఆమెకు కూడా కలిగింది. కానీ, తన వంతు ప్రయత్నంగా ప్రజలతో మమేకమైంది. అయితే, డాలీ అత్తగారు కూడా గతంలో సర్పంచ్‌గా పని చేయడం ఆమెకు కాస్త కలిసొచ్చింది. దీంతో ఫలానా వారి కోడల్ని అంటూ గ్రామ ప్రజలతో కలిసిపోయే ప్రయత్నం చేశారు డాలీ. ఆ ఎన్నికల్లో కేవలం 50 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సర్పంచ్‌ సీటు కోసం ఏడుగురు పోటీ చేయగా అందులో ఈమె ఒక్కరే మహిళా అభ్యర్థి కావడం గమనార్హం.

సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత ఆమె స్థానిక సంప్రదాయాలను పాటించడం మొదలు పెట్టారు. ఏ ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా తప్పకుండా హాజరయ్యేవారు. తనకు తోచిన సూచనలు, సలహాలు ఇచ్చేవారు. అలా కొన్ని రోజులు గడిచే సరికి వాళ్లకు ఆమెపై కొంత నమ్మకం కలిగింది.

గ్రామ న్యాయస్థానం బలోపేతం

తొలిసారి సర్పంచ్‌గా విధులు నిర్వర్తించిన మూడున్నరేళ్లలో డాలీ పంచాయతీలో కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. గ్రామ న్యాయస్థానాలను బలోపేతం చేశారు. పంచాయతీ పరిధిలో ఏ సమస్యలు ఉన్నా కోర్టుల చుట్టూ తిరగకుండా దాదాపు 95శాతం కేసులు ఇక్కడే పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టారు. అలాగని ఏదో నోటికొచ్చిన తీర్పులు చెప్పకుండా.. తనతోపాటు ఒక లాయర్‌ని పక్కన పెట్టుకొని నిజానిజాలు తేలిన తర్వాతే తీర్పులు చెప్పే వారు. ఈ క్రమంలో బాధితుల ఇళ్లకు వెళ్లి, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేవారు. సాధారణంగా సివిల్‌ కేసులు పరిష్కారం కావాలంటే కనీసం 5 నుంచి 10 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి రావొచ్చు. అలాంటిది గ్రామ న్యాయస్థానంలో 6 నెలల్లోపే కేసులు పరిష్కారమయ్యేవి. ప్రజలకు డబ్బు కూడా ఆదా అయ్యేది. 

అంతేకాకుండా డిజిటల్‌ రూపంలో సమస్యలు నమోదు చేసేలా ఓ ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు డాలీ. దీనిద్వారా గ్రామస్థులు తమ సమస్యలను అక్కడి సిబ్బంది సహకారంతో నేరుగా కంప్యూటర్లలోనే నమోదు చేయవచ్చు. సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేస్తే.. కేసు ఎప్పటిలోగా పరిష్కారమవుతుందో చెప్పేలా ఈ వ్యవస్థను డిజైన్‌ చేశారు. దీంతో కేసుల విచారణ పారదర్శకంగా జరిగేది. డాలీ తీసుకొచ్చిన సంస్కరణలతో ఆమెపై ప్రజలకు నమ్మకం ఏర్పడింది. దీంతో ఆస్తి పంపకాలతోపాటు కుటుంబ సమస్యలను సైతం ఆమె వద్దకు తీసుకొచ్చేవారు. 2019లో ఓ వితంతువుకు వాటా ఇచ్చేందుకు అత్తింటివారు నిరాకరించారు. దీంతో ఆమె తన 10 నెలల కుమార్తెతో కలిసి డాలీకి తన బాధను విన్నవించుకున్నారు. సర్పంచ్‌ స్థానంలో ఉన్న ఆమె కలుగజేసుకొని.. చట్టబద్ధంగా రావాల్సిన భూమిని ఆమెకు ఇప్పించారు. ఇలా ప్రజల్లో మమేకమైన ఆమె 2022లో జరిగిన పంచాయతీ  ఎన్నికల్లో 1500 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

మహిళలకు స్ఫూర్తి

మహిళలకు పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా 2006లో బిహార్‌ ప్రభుత్వం 50శాతం పంచాయతీ స్థానాలను మహిళలకే కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కానీ, అది రికార్డులకే పరిమితమైంది. చాలా చోట్ల భర్త తన భార్యను బరిలోకి దింపి తానే సర్పంచ్‌గా చలామణీ అయ్యేవారు. డాలీ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమెకూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. కొందరు గ్రామస్థులు తాను పక్కన ఉన్నప్పటికీ, సమస్యలను భర్తతో చెప్పేవారని, పంచాయతీ కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది కూడా తొలినాళ్లలో తనను సర్పంచ్‌గా అంగీకరించలేదని ఆమె చెబుతారు. అయితే కొద్దికాలంలోనే వాళ్లందరికీ తానేంటో అర్థమైందని చెప్పుకొచ్చారు డాలీ. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని చుట్టుపక్కల పంచాయతీల్లోని మహిళలు ఎన్నికల్లో పోటీచేసేందుకు తమంతట తాముగా ముందుకొచ్చారు. షాదీపూర్‌ గ్రామంలోని కొందరు విద్యార్థినులు, యువతలు ఆమెను అనుసరిస్తున్నారు. అలా వారందరికీ ఆమె ఓ రోల్‌మోడల్‌గా మారారు.

రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదని, పేద ప్రజలకు ఉన్నంతలో సేవ చేయాలనే సంకల్పంతోనే సర్పంచ్‌గా కొనసాగుతున్నానని అంటున్నారు. పంచాయతీ పరిధిలోని పిల్లలకు ఉత్తమ విద్యను అందించి వారి అభివృద్ధికి దోహదం చేస్తానని డాలీ చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని