Ravneet Singh Bittu: ఎన్నికల్లో ఓడినా.. పార్లమెంట్ సభ్యుడు కాకపోయినా.. కేంద్రమంత్రిగా

లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం పాలైనా.. రాజ్యసభ సభ్యుడిగా లేకపోయినా.. పంజాబ్‌ నేత రవనీత్‌ సింగ్‌ బిట్టు (Ravneet Singh Bittu) కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని మోదీ ఆయనకు అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారంటే..?

Published : 10 Jun 2024 11:05 IST

దిల్లీ: ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన రవనీత్ సింగ్‌ బిట్టు (Ravneet Singh Bittu).. పంజాబ్‌లో లుథియానా నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. రాజ్యసభలోనూ ఆయన సభ్యుడు కాడు. అయితే ఆదివారం జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం విశేషం.

వ్యవసాయ చట్టాలకు నిరసనగా 2020లో శిరోమణి అకాలీదళ్‌ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఈ ఎన్నికల్లో భాజపా ఒంటరిగా బరిలోకి దిగింది. కమలం పార్టీ నుంచి బరిలోకి దిగిన రవనీత్‌ను పంజాబ్‌ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా ఓడించారు. ఈ ఓటమి తర్వాత కూడా ఆయనపై అగ్రనాయకత్వం విశ్వాసంతో ఉంచింది. పంజాబ్‌లో ప్రభావశీల నేత అని భావిస్తోంది. అంతేగాకుండా ఆయన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడు. పంజాబ్‌ వేర్పాటువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బియాంత్.. సీఎంగా ఉన్న సమయంలోనే హత్యకు గురయ్యారు. ఆ కుటుంబ వారసుడు కావడం కూడా రవనీత్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి కారణమైందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోపక్క ఖలిస్థానీ సానుభూతిపరులు అమృత్‌ పాల్ సింగ్, సరబ్‌జిత్ సింగ్ ఖల్సా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. అమృత్‌పాల్‌ సింగ్ ప్రస్తుతం జైల్లోఉండగా..ఖల్సానేమో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడు కావడం గమనార్హం. ఈ పరిణామాల మధ్య బిట్టుకు ప్రాధాన్యం దక్కింది.

 ఆయన మోదీ సమావేశానికి వచ్చిన తరుణంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని నివాసానికి  వస్తుండగా.. ఆయన కారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. దాంతో ఆలస్యంగా వెళ్లకూడదని భావించి.. వాహనం దిగి, పరిగెత్తుకుంటూ సమావేశ వేదిక వద్దకు చేరుకోవడం గమనార్హం. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరోపక్క, కేరళ నుంచి జార్జ్‌ కురియన్‌ కూడా పార్లమెంట్‌ సభ్యుడు కాకపోయినా సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.  ఈసారి మంత్రి వర్గంలో ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న రెండో నేత ఆయన. క్రైస్తవ వర్గానికి చేరువ అయ్యేందుకు భాజపా వేసిన ఓ అడుగుగా దీనిని పరిగణిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని