Lalu Prasad: పిల్లలు.. గర్భిణీనీ టార్చర్‌ చేస్తున్నారు..! లాలూ కుమార్తె ఆగ్రహం

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబంపై ఈడీ తాజా దాడులను ఆయన కుమార్తె రోహిణి ఆచార్య ఖండించారు. పిల్లలు, గర్భిణీని చూడకుండా టార్చర్‌ చేస్తున్నారని ఆరోపించారు.

Published : 10 Mar 2023 23:26 IST

దిల్లీ: ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) కుటుంబం భూములు తీసుకుందన్న అభియోగాల (Land For Job Case) కేసులో ఈడీ(ED) శుక్రవారం సైతం సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ముంబయిల్లోని లాలూ కుటుంబానికి చెందిన పదికిపైగా ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ క్రమంలోనే తనిఖీల విషయంలో లాలూ కుమార్తె రోహిణి ఆచార్య(Rohini Acharya) మరోసారి ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులను ఉదయం నుంచి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు.

‘ఈ అన్యాయాలను గుర్తుంచుకుంటాం. చెల్లెలి చిన్న పిల్లలు ఏం నేరం చేశారు? తేజస్వీ యాదవ్‌ భార్య గర్భిణి. ఆమె ఏం నేరం చేసింది? అందరినీ ఎందుకు హింసిస్తున్నారు? ఈ రోజు ఉదయం నుంచి అందరినీ చిత్రహింసలకు గురిచేస్తున్నారు. లాలూ- రబ్రీ కుటుంబం.. ఫాసిస్టులు, అల్లరి మూకల ముందు తలవంచకపోవడమే వీరు చేసిన ఏకైక నేరం. అయినా.. ఇంకెంత దిగజారుతారు? 15 ఏళ్ల నాటి కేసును మళ్లీ తెరిచి ఏం నిరూపించాలనుకుంటున్నారు? సరైన సమయంలో దీనికి తగిన సమాధానం దొరుకుతుంది. కంసుడు కూడా గర్భిణీని అవమానించాడు. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. మీ సమయం కూడా ఆసన్నమైంది’ అని రోహిణి వరుస ట్వీట్లు చేశారు.

ఇటీవల ఇదే కేసులో లాలూను విచారించిన సమయంలోనూ రోహిణి ఆచార్య ఇదే విధంగా మండిపడ్డారు. తన తండ్రిని వేధిస్తోన్న తీరు సరికాదన్నారు. ఆయనకు దిల్లీ పీఠాన్ని కదిలించే శక్తి ఇప్పటికీ ఉందని ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా.. యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు.. 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరిగింది. ఈ క్రమంలోనే కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. దానిపై లాలూ, ఆయన సతీమణి రబ్రీదేవిని రెండు రోజులు సీబీఐ విచారించింది. ఇప్పుడు మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ సోదాలు నిర్వహించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని