Toll tax : ఏంటీ టోల్ ట్యాక్స్.. ఎందుకు చెల్లించాలి!
జాతీయ రహదారుల (National highway) పై టోల్ ఛార్జీలను (Toll charges) కేంద్రం (Central government) 5% పెంచింది. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏటా టోల్ ఛార్జీలను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పెంచుతోంది. ఈ నేపథ్యంలో అసలు టోల్ ట్యాక్స్ (Toll tax) అంటే ఏంటో తెలుసుకోండి.
రాష్ట్రంలోని రోడ్లను (Roads) ఉపయోగించడానికి ప్రతి వాహనదారుడు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి (State government) రోడ్ ట్యాక్స్ (Road tax) చెల్లించాల్సి ఉంటుంది. వాహనం బరువు, తయారైన సంవత్సరం, సీటింగ్ కెపాసిటీ, ఇంజిన్ (Engine) రకాలను బట్టి ఈ ట్యాక్స్ (Tax) మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఈ ట్యాక్స్ చెల్లించాం కదా అని విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనంతో రౌండ్స్ కొట్టొచ్చని అనుకోవద్దు. ఎందుకంటే మళ్లీ ఆ రోడ్డుపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని రోడ్ ట్యాక్స్ అనరు. టోల్ ట్యాక్స్ అంటారు. రవాణా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పని చేస్తుంది. ఇది ప్రైవేటు కాంట్రాక్టు సంస్థల సహాయంతో వివిధ రాష్ట్రాల మధ్య హైవేలు (Highway), ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తుంది. రోడ్డు వేయడానికి చేసిన ఖర్చును టోల్ రూపంలో వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది. ఈ ప్రక్రియ కొన్నేళ్లపాటు సాగుతుంది. రోడ్డు వేయడానికి ఖర్చు చేసిన మొత్తం వసూలైన తరువాత టోల్ ఫీజును 40 శాతానికి తగ్గించాలనే నిబంధన ఉంది.
ప్రతి 60 కిలోమీటర్ల పరిధిలో టోల్
టోల్ ట్యాక్స్, టోల్ ఛార్జీలను టోల్ అని సింపుల్‌గా పిలుస్తుంటారు. ఎక్స్‌ప్రెస్ వేస్, సొరంగ మార్గాలు, వంతెనలు, జాతీయ, రాష్ట్ర రహదారులపై రాకపోకలు సాగించే వాహనాల నుంచి టోల్ వసూలు చేస్తారు. ద్విచక్ర వాహనాలకు టోల్ నుంచి మినహాయింపు ఉంటుంది. మిగిలిన వాహనాల పరిమాణాన్ని బట్టి టోల్ వసూలు చేస్తారు. టోల్ చెల్లించే రహదారులను టోల్ రోడ్లని అంటారు. వీటి నిర్వహణ బాధ్యతను ఎన్‌హెచ్‌ఏఐ పర్యవేక్షిస్తుంటుంది. నిర్దేశిత ప్రదేశంలో టోల్ బూత్‌లు, ప్లాజాల పేరిట కౌంటర్లు ఏర్పాటు చేసి సంబంధిత మొత్తం చెల్లించిన తరువాతనే ఇక్కడ వాహనాలను రోడ్డుపైకి అనుమతిస్తారు. రెండు టోల్ బూత్‌ల మధ్య సాధారణంగా 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంతకంటే తక్కువ దూరంలోనూ ఉండే అవకాశముంది. ఆ దూరాన్ని బట్టి ట్యాక్స్ వసూలు చేస్తారు. ప్రతి ఏటా ఏప్రిల్ 1న అవసరాన్ని బట్టి టోల్ ధరలను పెంచుతున్నారు.
సాఫీ ప్రయాణానికి పన్ను!
టోల్ అనేది మనం పొందుతున్న సేవలకు చెల్లిస్తున్న ఓ పరోక్ష పన్ను. నాణ్యమైన, గుంతలు లేని రహదారిని వినియోగించి ప్రయాణం సాఫీగా చేస్తున్నందుకు చెల్లించే రుసుము. రోడ్లను అభివృద్ధి చేసేందుకు నిధులు సమకూర్చుకోవడం కోసం టోల్ వసూలు చేస్తారు. కేవలం రోడ్లు వేయడమే కాదు.. వాటి మరమ్మతులు, నిర్వహణ కోసం కూడా టోల్ నిధులను ఖర్చు చేస్తారు. ఏళ్ల తరబడి టోల్ వసూలు చేయడం వల్ల ఆ రోడ్డు వేయడానికి చేసిన ఖర్చు వసూలవుతుంది. ఈ మొత్తాన్ని ఎన్‌హెచ్‌ఏఐ తీసుకొని రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు చెల్లింపులు చేస్తుంది. టోల్ చెల్లించిన తరువాత ప్లాజా సిబ్బంది వాహనదారులకు రశీదు ఇస్తారు. టోల్‌గేట్ వసూలు చేసే దగ్గర టో వెహికల్, తాగునీరు, మరుగుదొడ్లు, అత్యవసర సేవలు, అగ్నిప్రమాద నియంత్రణ సౌకర్యాలుంటాయి.
ఫాస్టాగ్ రాకతో తగ్గిన రద్దీ
టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టారు. నగదు రహిత లావాదేవీలు చేసేందుకు ఫాస్టాగ్ ఉపయోగపడుతుంది. ఒక స్టిక్కర్‌లా కనిపించే ఫాస్టాగ్‌ను మొబైల్ నంబర్‌లా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఫాస్టాగ్‌ను కొన్ని మొబైల్ యాప్‌లు, టోల్‌ప్లాజా కేంద్రాల వద్ద విక్రయిస్తారు. మనం టోల్‌గేట్ వద్దకు వెళ్లగానే అక్కడి స్కానర్లు ఫాస్టాగ్‌ను రీడ్ చేస్తాయి. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా నిర్దేశిత టోల్ మొత్తం అందులో నుంచి కట్ అవుతుంది. ఈ ఫాస్టాగ్‌ల కారణంగా టోల్‌గేట్ల వద్ద రద్దీ బాగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఫాస్టాగ్ లేని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఏవైనా కారణాల వల్ల టోల్ ప్లాజాల దగ్గర 100 మీటర్ల కన్నా ఎక్కువ క్యూ ఉన్నట్టైతే వాహనదారులు టోల్ ఫీజు చెల్లించకుండా ముందుకు వెళ్లిపోవచ్చు. టోల్ ప్లాజా నుంచి 100 మీటర్ల దూరంలో ఎల్లో లైన్ ఉంటుంది. ఆ ఎల్లో లైన్ దాటి వాహనాలు క్యూలో ఉంటే టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాదు... టోల్ ప్లాజాల దగ్గర ఏవైనా సాంకేతిక సమస్యలు ఉన్నా వాహనదారులు టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్లిపోవచ్చని గతంలోనే కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
వీరికి మినహాయింపు
దేశంలోని టోల్ ప్లాజాల వద్ద రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, స్పీకర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, ఆర్మీ, పోలీసు అధికారులు ప్రయాణించే అధికారిక వాహనాలకు మినహాయింపు ఉంటుంది. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు, అంతిమయాత్ర వాహనాల నుంచి టోల్ తీసుకోరు. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో ఆర్టీవో ఆఫీసులో రిజిస్టర్ అయిన వాహనాలకు స్థానికులు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. అందుకోసం దరఖాస్తు చేసుకొని సంబంధిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. స్థానిక వాహనాలకు తక్కువ ఖర్చుతో టోల్‌పాస్‌లు ఇస్తారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
World News
Erdogan: జైలు నుంచి అధ్యక్షపీఠం వరకు.. ఎర్డోగాన్ రాజకీయ ప్రస్థానం..!
-
Politics News
AAP-Congress: ఆర్డినెన్స్‌పై పోరు.. ఆమ్ఆద్మీకి కాంగ్రెస్ మద్దతిచ్చేనా?
-
India News
అవినీతి ఆరోపణలు.. రోల్స్‌రాయిస్‌పై సీబీఐ కేసు
-
India News
హరివంశ్ నారాయణ్.. భావితరాలకు మీరు చెప్పేది ఇదేనా?: జేడీయూ
-
Sports News
IPL 2023: శుభ్‌మన్ గిల్ విషయంలో కోల్‌కతా ఘోర తప్పిదమదే: స్కాట్ స్టైరిస్