Ashok Gehlot: మ్యాజిక్‌ షోలు చేసైనా డబ్బులు సంపాదిస్తా.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

అవసరమైతే మ్యాజిక్‌ చేసైనా సరే డబ్బులు సంపాదిస్తానని అన్నారు రాజస్థాన్‌ ముుఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot). అయితే, దీనిపై భాజపా వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది.

Published : 05 Jun 2023 13:10 IST

జోధ్‌పుర్‌: రాజస్థాన్‌ (Rajasthan) ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జోధ్‌పుర్‌ (Jodhpur) ప్రజలకు తాను ప్రథమ సేవకుడినని అభివర్ణించుకున్న ఆయన.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అవసరమైతే మ్యాజిక్‌ (magic tricks) చేసైనా సరే డబ్బులు సంపాదిస్తానని తెలిపారు. జోధ్‌పుర్‌లో కొత్తగా నిర్మించిన ‘రావు జోధా మార్గ్‌’ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం.. ఈ విధంగా వ్యాఖ్యానించారు.

‘‘42 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం నుంచి నేను తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాను. అప్పుడు జోధ్‌పుర్‌ ఎలా ఉండేది..? నీళ్లు లేవు.. రైళ్లు లేవు. కానీ ఈ రోజు పరిస్థితులు మారిపోయాయి. నీటి సరఫరా, విద్యుత్‌, రైళ్లు, రోడ్లు, విద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాలు అన్నీ సమకూర్చగలిగాను. జోధ్‌పుర్‌పై ఎవరైనా అధ్యయనం చేస్తే.. అభివృద్ధి అంటే ఏంటో వారు కచ్చితంగా తెలుసుకుంటారు. ఇలాంటి గొప్ప పట్టణానికి యునెస్కో వారసత్వ హోదా ఇవ్వాలి’’ అని గహ్లోత్‌ తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం తాను మరింత కృషి చేస్తానని అన్నారు. ‘‘అవసరమైతే మ్యాజిక్‌ ప్రదర్శనలు ఇచ్చి అయినా సరే డబ్బులు సంపాదిస్తా.. అంతేగానీ, జోధ్‌పుర్‌ ప్రజలను నిరాశపర్చను’’ అని గహ్లోత్‌ (Ashok Gehlot) వ్యాఖ్యలు చేశారు. జోధ్‌పుర్‌కు చెందిన ప్రొఫెషనల్‌ మ్యాజీషియన్ల కుటుంబంలో అశోక్‌ గహ్లోత్‌ జన్మించారు.

భాజపా సెటైర్లు..

అయితే సీఎం గహ్లోత్‌ ‘మ్యాజిక్‌’ వ్యాఖ్యలపై భాజపా (BJP) వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. ‘‘సీఎం తన పదవీకాలంలో కేవలం మ్యాజిక్‌ ట్రిక్స్‌ మాత్రమే ప్రదర్శిస్తున్నారు. కేంద్రం ప్రారంభించిన ప్రాజెక్టుల పేర్లు మార్చి తమవిగా చెబుతున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో బంగారం, నగదు దొరికాయి. అది మ్యాజిక్‌ కాకపోతే మరేంటీ?’’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషీ సెటైర్లు వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని