Kejriwal: జైల్లోనే కేజ్రీవాల్‌కు కార్యాలయం.. కోర్టు అనుమతి కోరుతాం: మాన్‌

జైలు నుంచే సీఎం కేజ్రీవాల్‌ పరిపాలన కొనసాగిస్తారని, ఆయన కార్యాలయం ఏర్పాటుకు కోర్టు నుంచి అనుమతి తీసుకుంటామని భగవంత్‌ మాన్‌ అన్నారు.

Published : 23 Mar 2024 19:51 IST

దిల్లీ: మద్యం కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (kejriwal).. సీఎం పదవిలో కొనసాగవచ్చా? లేదా? అనే అంశంపై చర్చ నడుస్తోంది. కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి తరలించిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని భాజపా డిమాండ్‌ చేస్తుండగా.. ఆప్‌ మాత్రం జైలు నుంచే పరిపాలన చేస్తారని చెప్తోంది. తాజాగా దీనిపై ఆప్‌ నేత, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ మాట్లాడారు. కేజ్రీవాల్‌ జైలు నుంచి పరిపాలిస్తారని, జైల్లో కార్యాలయం ఏర్పాటుకు కోర్టు నుంచి అనుమతి తీసుకుంటామని చెప్పారు.

‘‘జైలు నుంచి పరిపాలన చేయకూడదని ఎక్కడా చెప్పలేదు. జైలు కెళ్లినంత మాత్రాన నేరస్థుడు కాదని చట్టం చెబుతోంది. కాబట్టి ప్రభుత్వాన్ని నడిపేందుకు జైల్లోనే కార్యాలయం ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి అనుమతి తీసుకుంటాం’’ అని భగవంత్‌ మాన్‌ చెప్పారు. ఆమ్‌ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్‌ స్థానాన్ని ఏ ఒక్కరూ భర్తీ చేయలేరని పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఆప్‌ను ఆయనే స్థాపించారని మాన్‌ అన్నారు.

మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయిన అరవింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీ సీఎంగా కొనసాగవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సీఎంగా అరెస్టయిన వ్యక్తి ఆ పదవిలో కొనసాగడంపై చట్టంలో ఎలాంటి నిషేధమూ లేదని ఓ సీనియర్‌ న్యాయవాది తెలిపారు. సాంకేతికంగా జైలు నుంచి పరిపాలించడం సాధ్యమేనని పేర్కొన్నారు. అయితే, చట్టపరంగా ఎలాంటి నిషేధం లేకున్నా పరిపాలనా పరంగా కొనసాగడం అసాధ్యమేనని మరో న్యాయవాది చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని