Delhi High Court: మీరూ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.. దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రికి హైకోర్టు హెచ్చరిక

నగరంలో విస్తరిస్తున్న అక్రమ పాథలాజికల్‌ ల్యాబ్‌ల విషయంలో ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్, కార్యదర్శి ఎస్బీ దీపక్ కుమార్‌లను జైలుకు పంపే అవకాశముందని దిల్లీ హైకోర్టు హెచ్చరించింది. 

Published : 22 Mar 2024 16:21 IST

దిల్లీ: నగరంలో విస్తరిస్తున్న అక్రమ పాథలాజికల్‌ ల్యాబ్‌ల విషయంలో ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్, కార్యదర్శి ఎస్బీ దీపక్ కుమార్‌లపై దిల్లీ హైకోర్టు మండిపడింది. వారిని జైలుకు పంపే అవకాశముందని హెచ్చరించింది. క్లినికల్‌ సంస్థలను నియంత్రించేందుకు చట్టం తీసుకురావడంపై న్యాయపరమైన ఆదేశాలు పాటించనందుకు చేపట్టిన విచారణ సందర్భంగా సౌరభ్ భరద్వాజ్,  ఎస్బీ దీపక్ కుమార్‌లపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. 

‘మీరు ప్రజా సేవకులు. అక్రమ ల్యాబ్‌ల వల్ల ప్రజలు తమ రక్త నమూనాల గురించి తప్పుడు నివేదికలు పొందుతున్నారు. దీనివల్ల వారికి ఏదైనా జరిగితే మీరిద్దరూ జైలుకు వెళ్తారు. ఇందులో ఏ సందేహం లేదు’ అని కోర్టు పేర్కొంది. అనధికార ల్యాబ్‌ల నియంత్రణకు వెంటనే న్యాయపరమైన వ్యవస్థను ఏర్పాటుచేయడానికి తన ఛాంబర్లో మంత్రి, కార్యదర్శితో సమావేశం కావాలని స్టాండింగ్‌ కౌన్సిల్‌ను ఆదేశించింది. రిజిస్ట్రేషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ బిల్లు 2022 పై చర్చ జరుగుతున్నప్పుడు వారు నిబంధనలకు అనుకూలంగా వ్యవహరించ లేదని కోర్టు పేర్కొంది. 2022 నుంచి అక్రమ ల్యాబ్‌ల విషయంలో వాటి నియంత్రణకు ఏర్పాటుచేసిన చట్టాన్ని అమలుచేయలేదని, ఈ జాప్యానికి కారణాలేంటో తెలిపేందుకు విచారణకు హాజరు కావాలని కోర్టు ఇద్దరినీ కోరడంతో వారు గురువారం విచారణకు హాజరయ్యారు.

దిల్లీలో కొన్ని అనధికార ల్యాబొరేటరీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు అర్హత లేని సాంకేతిక నిపుణులతో నడుస్తున్నాయని, వారు రోగులకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపిస్తూ బెజోన్ కుమార్ మిశ్రా అనే వ్యక్తి 2018లో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. దిల్లీ-ఎన్‌సీటీలో, చుట్టుపక్కల ఇలాంటి అక్రమ ల్యాబ్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయని అలాంటి అర్హత లేని రోగనిర్ధారణ ల్యాబ్‌ల సంఖ్య 20,000 నుంచి 25,000 మధ్య ఉండొచ్చని, రాజధానిలో ప్రతీ వీధిలో అలాంటివి ఉన్నాయని పిటీషనర్‌ కోర్టుకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు