LS Polls: లక్షద్వీప్‌.. అందాల దీవుల్లో ‘అతివల’ కష్టాలు!

ప్రకృతి అందాలతో మెరిసిపోయే లక్షద్వీప్‌ (Lakshadweep)లో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

Published : 09 Apr 2024 16:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లక్షద్వీప్‌ (Lakshadweep).. ప్రకృతి అందాలతో అలరారే దీవులవి. దేశ, విదేశీ పర్యటకులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల ఈ ప్రాంతాన్ని సందర్శించిన ప్రధాని మోదీ (Modi in Lakshadweep).. స్థానిక పర్యటకాన్ని ప్రోత్సహించాలని పిలుపునివ్వడంతో మరోసారి ఆ దీవులకు కళ వచ్చినట్లయ్యింది. ఒకవైపు ఇలాఉంటే.. మరోవైపు స్థానిక మహిళల సమస్యలు అనేకం. ముఖ్యంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు పడేసేందుకు సరైన వసతుల లేమీ, అత్యవసర సేవల కోసం గైనకాలజిస్టులు అందుబాటులో లేకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ ఈ అంశాలనే లేవనెత్తుతున్న లక్షదీవుల అతివలు.. తమ డిమాండ్లపై నేతల నుంచి స్పందన కరవైందని మండిపడుతున్నారు.

లక్షద్వీప్‌లో ఒక లోక్‌సభ నియోజకవర్గం ఉంది. ఇక్కడ నివాసయోగ్యమైన పది దీవులున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 57,574. ఇందులో 28,442 మంది మహిళలే. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడినుంచి ఎన్నికల బరిలో ఉన్నవారిలో ఒక్క మహిళ కూడా లేరు. మరోవైపు.. స్థానిక పాలన మరుగున పడింది. దీంతో అనేక సమస్యలకు నెలవుగా మారింది.

మహిళల వెతలు..

‘ఇక్కడి రాజకీయ నేతలకు మహిళల సమస్యలు పట్టవు. ఖాళీగా ఉన్న గైనకాలజిస్టు పోస్టును భర్తీ చేయాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. ఇప్పటివరకు పరిష్కారం చూపలేదు. ఉన్నత చదువులకు వెళ్లాలన్నా కేరళనే దిక్కు. స్థానిక ద్వీపాలకు వెళ్లాలంటే సౌకర్యాలు ఉండవు. ఖర్చు అధికం’ అని ఓ స్థానిక మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

‘స్థానికంగా వైద్య వ్యవస్థ అధ్వాన స్థితిలో ఉంది. గర్భిణుల వెతలు చెప్పలేనివి. స్కానింగ్‌ కావాలన్నా కవరత్తీ వెళ్లాల్సిందే. శానిటరీ న్యాప్‌కిన్లను సేకరించి, పారవేసే వ్యవస్థ లేదు. వాటిని పాతిపెట్టడమో, కాల్చివేయడమో చేయాల్సివస్తోంది. ప్లాస్టిక్‌ను కాల్చడంతో స్థానిక దీవుల్లో పర్యావరణ సమస్యలు తలెత్తే ముప్పు ఉంది’ అని ఓ స్థానిక మహిళ వాపోయారు.

ఇదిలాఉంటే, దేశంలోనే అతి చిన్న లోక్‌సభ స్థానం లక్షద్వీప్‌. తొలి విడతలో భాగంగా ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న లెక్కింపు ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని