Kannada Row: భాష పరిరక్షణ పేరిట విధ్వంసాన్ని ఉపేక్షించం: డీకే శివకుమార్‌

‘కన్నడ’ కోసం పోరాడుతోన్నవారికి తాము వ్యతిరేకం కాదని, అయితే.. దీని పేరిట విధ్వంసానికి పాల్పడితే మాత్రం ఉపేక్షించమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పేర్కొన్నారు.

Updated : 28 Dec 2023 16:35 IST

బెంగళూరు: ‘కన్నడ (Kannada)’ పరిరక్షణ పేరిట ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ఉపేక్షించబోమని కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar) హెచ్చరించారు. రాష్ట్ర భాషను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వాణిజ్య, వ్యాపార సంస్థల నామఫలకాలపై కనీసం 60 శాతం కన్నడ ఉండేలా చూడాలంటూ బుధవారం స్థానికంగా తీసిన ర్యాలీలు ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. మరోవైపు.. ‘కర్ణాటక రక్షణ వేదికె’ అధ్యక్షుడు టీఏ నారాయణగౌడ సహా 29 మంది కార్యకర్తలకు బెంగళూరులోని మేజిస్ట్రేట్‌ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

‘‘కన్నడ కోసం పోరాడుతోన్న వారికి మేం వ్యతిరేకం కాదు. వారిని గౌరవిస్తాం. అయితే.. విధ్వంసానికి పాల్పడితే ప్రభుత్వం కళ్లు మూసుకోదు. వారు నిరసన వ్యక్తం చేయొచ్చు. కానీ, ఆస్తులకు నష్టం కలిగించడం ఆమోదయోగ్యం కాదు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చారు. ప్రజలు తమ జీవనోపాధి కోసం ఇక్కడ నివసిస్తున్నారు. ఈ పరిణామాలు వారిలో భయాందోళనలు కలిగించకూడదు. కన్నడ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. అధికారిక కార్యకలాపాలు రాష్ట్ర భాషలోనే ఉండాలని ముఖ్యమంత్రి కూడా మమ్మల్ని ఆదేశించారు. 60 శాతం కన్నడ విషయంలో ప్రభుత్వ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. దీన్ని ఉల్లంఘించినవారికి నోటీసులు జారీ చేయడం వంటి మార్గాలు ఉన్నాయి’’ అని మీడియాతో డీకే అన్నారు.

కరవే ఆందోళన తీవ్రరూపం

ఇదిలా ఉండగా.. నామఫలకాల విషయంలో టీఏ నారాయణగౌడ బుధవారం యలహంక సమీపంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల ఆంగ్లంలో ఉన్న నామఫలకాలను ఆందోళనకారులు రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. మరికొన్ని చోట్ల వాటిని బలవంతంగా తొలగించారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి ఆందోళనకారులను నియంత్రించారు. ఆయా ఘటనల్లో దాదాపు 500 మందిని అదుపులోకి తీసుకున్నారు. యలహంకలో అరెస్టయిన నారాయణగౌడ తదితరులను గురువారం తెల్లవారుజామున 5 గంటలకు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చగా.. 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని