X Corp: ట్విటర్‌కు ఇదే లాస్ట్‌ ఛాన్స్‌ : కర్ణాటక హైకోర్టు

సామాజిక మాధ్యమాల్లో (Social Media) అభ్యంతరకర కంటెంటు తొలగింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించే విషయంపై ఎక్స్‌ కార్పొరేషన్‌కు (గతంలో ట్విటర్‌)కు కర్ణాటక హైకోర్టు చివరి అవకాశం ఇచ్చింది.

Published : 24 Aug 2023 18:34 IST

బెంగళూరు: సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర కంటెంటు తొలగింపునకు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (MeiTY) ఇచ్చిన ఆదేశాలను పాటించే విషయంపై ఎక్స్‌ (గతంలో ట్విటర్‌)కు కర్ణాటక హైకోర్టు మరో అవకాశం ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నామని చెప్పడానికి ఉన్న సమాచారాన్ని తమ ముందు ఉంచాలని.. ఇందుకు ఇదే చివరి అవకాశమని (Karnataka High Court) స్పష్టం చేసింది.

ఎక్స్‌ (ట్విటర్‌)కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బ్లాకింగ్‌ ఆదేశాలకు సంబంధించిన కేసును కర్ణాటక హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రసన్న బీ వరాలే, జస్టిస్‌ ఎంజీఎస్‌ కమల్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ క్రమంలో తమ క్లయింట్‌ నుంచి నుంచి సమాచారం రావాల్సి ఉందని.. ఇందుకు మరికొంత సమయం కావాలని ఎక్స్‌ (ట్విటర్‌) తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం.. ఇదే చివరి అవకాశం అని పేర్కొంటూ తదుపరి విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది.

ట్విటర్‌కు షాక్‌.. రూ.50లక్షల జరిమానా

మైక్రోబ్లాగింగ్‌ ‘ఎక్స్‌’లో సమాచారాన్ని బ్లాక్‌ చేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఎక్స్‌ (ట్విటర్‌) ఈ ఏడాది జూన్‌లో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. దీనిని తోసిపుచ్చిన హైకోర్టు.. సదరు సంస్థ చేసిన అభ్యర్థనకు ఎటువంటి అర్హత లేదని పేర్కొంటూ రూ.50లక్షల జరిమానా విధించింది. దీనిని డివిజన్‌ బెంచ్‌ ముందు ట్విటర్‌ సవాలు చేసింది. దీనిపై ఇటీవల ఓసారి వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. విచారణకు ముందే రూ.25లక్షల జరిమానా డిపాజిట్‌ చేయాలని సూచించింది. అయితే, తాము ఇచ్చిన ఆదేశాలను ట్విటర్‌ పాటించడం లేదని ప్రభుత్వం వాదిస్తుండగా.. సంస్థ మాత్రం దాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నామని చెప్పడానికి ఉన్న సమాచారాన్ని తదుపరి విచారణలోగా తమ ముందు ఉంచాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మరికొంత సమయం కావాలని ట్విటర్‌ తరఫు న్యాయవాది కోరడంతో హైకోర్టు అంగీకరిస్తూ ఇదే చివరి అవకాశమని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని