YouTuber arrest: ఈవీఎంలపై వీడియో.. యూట్యూబర్‌ అరెస్టు

YouTuber arrest: ఈవీఎంల వినియోగంపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న ఓ యూట్యూబర్‌ను కేరళ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

Published : 03 Apr 2024 18:01 IST

తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) సమీపిస్తున్న వేళ నెట్టింట తప్పుడు సమాచారం ఈసీ (EC)కి తలనొప్పిగా మారింది. అసత్య ప్రచారాల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈవీఎం (EVM)లపై నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న ఓ యూట్యూబర్‌ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. (YouTuber arrested in Kerala)

కేరళకు చెందిన యూట్యూబ్‌ ఛానల్‌ ‘వెనిస్‌ టీవీ’ యజమాని ఇటీవల ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. ఈవీఎంలతో మోసాలు జరుగుతాయని, ఈసారి లోక్‌సభ ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్లతో నిర్వహించాలని ప్రచారం చేశాడు. ఇది కాస్తా అధికారుల దృష్టికి రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

మోదీకి సరైన పోటీ ఎవరు..? శశిథరూర్‌ ఆసక్తికర సమాధానం

సమాజంలో ఉద్రిక్తతలను సృష్టించాలనే ఉద్దేశంతోనే అతడు ఈ వీడియోను రూపొందించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. బుధవారం అతడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో సోషల్‌ మీడియాపై నిఘాను పెంచామని, ఆన్‌లైన్‌ కంటెంట్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కేరళలో మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 26న రెండో విడతలో పోలింగ్‌ జరగనుంది.

మరోవైపు, లోక్‌సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఈసీ ‘మిథ్‌ వర్సెస్‌ రియాలిటీ రిజిస్టర్‌’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ప్రజలు ఎప్పటికప్పుడు అడిగే ప్రశ్నలను, వెలుగులోకి వచ్చిన నకిలీ సమాచారాన్ని ఈ రిజిస్టరు ద్వారా అప్‌డేట్‌ చేస్తూ ఓటర్లకు తెలుపుతామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని