Tollywood: నాని- కీర్తి సురేశ్‌ ‘..లోకల్‌’ మెమొరీస్‌.. 21 ఏళ్లలో పాయల్‌ రాజ్‌పుత్‌ ఇలా!

తాము కలిసి నటించిన ‘నేను లోకల్‌’ సినిమా ఏడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నాని, కీర్తిసురేశ్‌ సోషల్‌ మీడియాలో సందడి చేశారు. పాయల్‌ రాజ్‌పుత్‌ మోడలింగ్‌ కెరీర్‌ను గుర్తుచేసుకున్నారు.

Updated : 04 Feb 2024 16:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాని (Nani), కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) కలిసి నటించిన రొమాంటిక్‌ కామెడీ మూవీ ‘నేను లోకల్‌’ (Nenu Local). ఈ చిత్రం ఏడేళ్లు (#7YearsForNenuLocal) పూర్తి చేసుకున్న సందర్భంగా వారిద్దరు నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లారు. ఆ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో నానిని ట్యాగ్‌ చేస్తూ కీర్తి సురేశ్‌ పోస్ట్‌ పెట్టగా ఆయన ఆట పట్టించారు. ‘సమయం వేగంగా కదులుతోంది. అప్పుడే ఏడేళ్లు గడిచాయంటే నమ్మబుద్ధికావట్లేదు. మనం ఇంకా చాలా సినిమాల్లో కలిసి నటించాలి’ అని కీర్తి పేర్కొన్నారు. ఆ చిత్రంలో తాము పోషించిన పాత్రల పేర్లు (బాబు, పొట్టి) మెన్షన్‌ చేసి స్మైలీ ఎమోజీలు జోడించారు. దానిపై నాని స్పందిస్తూ ‘కీర్తి.. నువ్వు తప్పించుకోలేవ్‌. నిన్ను డిస్టర్బ్‌ చేస్తూనే ఉంటా’ అని అన్నారు. సంబంధిత పోస్ట్‌ల స్క్రీన్‌షాట్లను ‘ఎక్స్‌’ (ఇంతకుముందు ట్విటర్‌)లో షేర్‌ చేస్తూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ చిత్రంలోని ‘డిస్టర్బ్‌ డిస్టర్బ్‌ చేస్తా నిన్ను’ సాంగ్‌ శ్రోతల్ని అలరించిన సంగతి తెలిసిందే. 

త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2017 ఫిబ్రవరి 3న విడుదలైంది. బాబు పాత్రలో నాని, కీర్తి పాత్రలో కీర్తి సురేశ్‌ ఆకట్టుకుని, హిట్‌ జోడీగా నిలిచారు. దీని తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన ‘దసరా’ గతేడాది విడుదలై విజయాన్ని అందుకుంది.

ఫస్ట్‌ ఫొటోషూట్‌: పాయల్‌

తన మోడలింగ్‌ కెరీర్‌ని గుర్తుచేసుకున్నారు పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput). 21 ఏళ్ల వయసులో ఆ రంగంలోకి అడుగుపెట్టానని తెలిపారు. తన తొలి ఫొటోషూట్‌ స్టిల్స్‌ను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మోడలింగ్‌ కోసం కొన్నాళ్లపాటు దిల్లీలో ఉన్నానని, తర్వాత ముంబయికి షిఫ్ట్‌ అయి టెలివిజన్‌ ఇండస్ట్రీలో అవకాశాలు సొంతం చేసుకున్నానని చెప్పారు. పలు సీరియళ్లలో నటించిన ఆమె 2017లో ఓ పంజాబీ చిత్రంతో హీరోయిన్‌గా మారారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ (2018)తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టిని ఆకర్షించారు. గతేడాది నవంబరులో విడుదలైన ‘మంగళవారం’ (Mangalavaaram)తో మరో హిట్‌ కొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని