నటి మృతి.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రాని కుటుంబం

బాలీవుడ్‌ నటి నూర్‌ మాలబికా దాస్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పూర్తిగా కుళ్లిపోయే స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 11 Jun 2024 00:05 IST

ముంబయి: బాలీవుడ్ నటి నూర్‌ మాలబికా దాస్‌ (Noor Malabika Das) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె ఉంటున్న ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అస్సాంకు చెందిన నూర్‌ మాలబికా దాస్‌.. కెరియర్‌ దృష్ట్యా ముంబయిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడాన్ని ఇరుగుపొరుగు వారు గుర్తించి, అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన పోలీసులు తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా, ఆమె మృతదేహం పూర్తిగా కుళ్లిపోయే స్థితికి చేరింది.

నూర్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్య దశలో ఉన్న ఆమె తల్లిదండ్రులు.. ఇటీవలే ముంబయికి వచ్చివెళ్లారు. కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు మళ్లీ రాలేమంటూ సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె స్నేహితుడు, నటుడు అలోక్‌నాథ్‌ పాఠక్‌ ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో అంత్యక్రియలు నిర్వహించారు.

బ్రెస్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ సర్జరీ చేయించుకోవాలని బలవంతం పెట్టారు: సమీరా రెడ్డి

నూర్‌ మాలబికా దాస్‌ గతంలో ఖతర్‌ ఎయిర్‌వేస్‌లో ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేశారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ముంబయికి వచ్చారు. బాలీవుడ్‌ ప్రముఖ నటి కాజోల్‌ నటించిన ‘ది ట్రయల్‌’ (The Trial) సిరీస్‌తోపాటు పలు వెబ్‌ షోల్లో నటించారు. నూర్‌ మృతిపై ‘ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌’ విచారం వ్యక్తం చేసింది. మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, హోం మంత్రి దేవేంద్ర ఫడణవీస్‌లను కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని