Vijay Varma: ఆ సంగతి తలుచుకుని ఏడ్చేశా.. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నా: విజయ్‌ వర్మ

నటుడు విజయ్‌ వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కెరీర్‌ ప్రారంభంలో ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడారు.

Published : 24 Nov 2023 18:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్‌ వర్మ (Vijay Varma). హైదరాబాద్‌కు చెందిన ఈయన తెలుగుకంటే హిందీలోనే వరుస అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కెరీర్‌ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నారు. ఆర్థికంగా బాగా ఇబ్బంది పడినట్లు తెలిపారు.

రివ్యూ: కోట బొమ్మాళి P.S. మూవీ ఎలా ఉందంటే?

‘‘ఒకానొక సమయంలో నా వద్ద డబ్బుల్లేవు. బ్యాంకు ఖాతాలో రూ. 18 ఉన్నాయి. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. అప్పుడే ఓ సినిమా టీమ్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఒక్కరోజు రిపోర్టర్‌గా నటిస్తే రూ. 3000 ఇస్తామని చెప్పారు. అలాంటి చిన్న పాత్రలు పోషించడం ఇష్టంలేకపోయినా డబ్బు కోసం మనసు చంపుకొని వెళ్లా. ఇంగ్లిష్‌ రిపోర్టర్‌గా నటించాలనే విషయం అక్కడకు వెళ్లాక తెలిసింది. ఆ క్యారెక్టర్‌ ప్లే చేయడం అంత తేలిక అనిపించలేదు. చివరకు రిజెక్ట్‌ అయ్యా. అయితే, అప్పటికే నేను ‘మాన్సూన్‌ షూటౌట్‌’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించా. అయినా ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సెట్స్‌ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ సంఘటన తలచుకుని ఏడ్చేశా. 2014లో జరిగిన సంగతి ఇది. డబ్బు కోసం నచ్చని పాత్రల్లో నటించకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా. ఆ మేరకు అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇష్టపడిన పాత్రలే తప్ప డబ్బు కోసం ఏదీ చేయలేదు’’ అని తెలిపారు.

ప్రముఖ హీరోయిన్‌ తమన్నా (Tamannaah Bhatia) బాయ్‌ఫ్రెండ్‌గానూ విజయ్‌ ఇటీవల పాపులర్‌ అయ్యారు. 2008లో ఓ షార్ట్‌ఫిల్మ్‌తో నటుడిగా మారిన ఆయన ‘చిట్టగాంగ్‌’ (2012)తో తొలిసారి వెండితెరపై కనిపించారు. అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పింక్‌’ సినిమాలో అంకిత్‌ మల్హోత్రగా విశేషంగా ఆకట్టుకున్నారు. తర్వాత ‘గల్లీ బాయ్‌’, ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’, ‘భాగి 3’, ‘డార్లింగ్స్‌’ తదితర చిత్రాల్లో నటించారు. తమన్నాతో కలిసి ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’లో సందడి చేశారు. విజయ్‌ నటించిన తెలుగు సినిమా ‘ఎంసీఏ’ (MCA). నాని (Nani) హీరోగా రూపొందిన ఈ చిత్రంలో ఆయన ప్రతినాయకుడిగా మెప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని