Kotabommali PS Review: రివ్యూ: కోట బొమ్మాళి P.S. మూవీ ఎలా ఉందంటే?

Kotabommali PS Review: శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ కీలక పాత్రల్లో నటించిన ‘కోటబొమ్మాళి P.S.’ ఎలా ఉందంటే?

Updated : 24 Nov 2023 16:37 IST

Kotabommali PS Review; చిత్రం: కోటబొమ్మాళి P.S; నటీనటులు: శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ తదితరులు; సంగీతం: రజనీ రాజ్‌; ఎడిటింగ్‌: కార్తిక్‌ శ్రీనివాస్‌; సినిమాటోగ్రఫీ: జగదీష్‌ చీకటి; నిర్మాత: బన్నీ వాస్‌, విద్య కొప్పినీడి; దర్శకత్వం: తేజ మర్ని; విడుదల: 24-11-2023

వంబరు సినీ క్యాలెండరు ముగింపుకొచ్చింది. చివరి వారం బాక్సాఫీస్‌ ముందు చిన్న.. మీడియం రేంజ్‌ సినిమాల సందడి కనిపించింది. వాటిలో కాస్త మంచి అంచనాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రం ‘కోటబొమ్మాళి PS’. మలయాళంలో విజయవంతమైన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘నాయట్టు’కు రీమేక్‌గా రూపొందింది. శ్రీకాంత్, రాహుల్‌ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలు పోషించారు. తేజ మార్ని దర్శకత్వం వహించారు. విడుదలకు ముందే ‘‘లింగిడి..’’ పాటతో జనాల్లో ప్రాచుర్యం పొందిన ఈ చిత్రం.. టీజర్, ట్రైలర్లతో ఆ అంచనాల్ని రెట్టింపు చేసుకుంది. (Kotabommali PS Review in telugu) మరి ఈ ‘కోటబొమ్మాళి..’ కథేంటి? సినీప్రియులకు ఎలాంటి అనుభూతి అందించింది?

కథేంటంటే: ఆంధ్రప్రదేశ్‌లో టెక్కలి ఉప ఎన్నికల హడావుడి మొదలవుతుంది. దీన్ని అధికార పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అందుకే పార్టీని గెలిపించే బాధ్యతను హోంమంత్రి బరిసెల జయరామ్‌ (మురళీశర్మ) చేతుల్లో పెడుతుంది. ఎన్నికలకు మరో మూడు రోజులు సమయం ఉందనగా.. కోటబొమ్మాళి పీఎస్‌ పరిధిలో ఓ పోలీస్‌ జీప్‌ వల్ల జరిగిన రోడ్డు ప్రమాదం అధికార పార్టీకి తలనొప్పిగా మారుతుంది. ఆ ప్రమాదంలో మరణించిన వ్యక్తి ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడమే అందుకు కారణం. మరోవైపు ఆ ప్రమాదానికి కారణమైన పోలీస్‌జీప్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణ (శ్రీకాంత్‌), కొత్తగా డ్యూటీలో చేరిన కానిస్టేబుల్‌ రవి (రాహుల్‌ విజయ్‌), మహిళా కానిస్టేబుల్‌ కుమారి (శివాని రాజశేఖర్‌) ఉంటారు. వీళ్లకు ఆ సామాజిక వర్గంలోని యువనేత మున్నా (పవన్‌ తేజ్‌ కొణిదెల)కు మధ్య అప్పటికే ఓ గొడవ జరిగి ఉంటుంది. అందుకే ఈ ప్రమాదాన్ని పావుగా వాడుకొని దాన్నొక రాజకీయ సమస్యగా మార్చి వాళ్లపై పగ తీర్చుకోవాలని ప్రణాళిక రచిస్తాడు మున్నా. అయితే ఈ సమస్య తీవ్రతను ముందుగానే పసిగట్టిన రామకృష్ణ.. రవి, కుమారిలను తీసుకొని పరారీ అవుతాడు. దీంతో అధికారిక పార్టీపై ఒత్తిడి పెరిగిపోతుంది. (Kotabommali PS Review in telugu) ఇది ఎన్నికల్లో విజయాన్ని నిర్దేశించే సమస్య కావడంతో హోంమంత్రి పరారీలో ఉన్న రామకృష్ణతో పాటు మిగతా ఇద్దరు నిందితుల్ని 48గంటల్లో అరెస్టు చేస్తామని శపథం చేస్తారు. ఇందుకోసం ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌.. ఎస్పీ రజియా అలీ (వరలక్ష్మీ శరత్‌ కుమార్‌)ను రంగంలోకి దించుతారు. మరి పోలీస్‌ శాఖలో 20ఏళ్ల అనుభవం ఉన్న రామకృష్ణ.. రజియా ఎత్తుల్ని చిత్తు చేస్తూ ఎలా తప్పించుకున్నాడు? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లేంటి? ఈ పోరులో పైచేయి సాధించిందెవరు? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే: పోలీసు వ్యవస్థకూ రాజకీయ వ్యవస్థకూ మధ్య జరిగే ఆసక్తికర కథాంశంతో రూపొందిన చిత్రమిది. అధికారం అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థని రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారు? రాజకీయ ఒత్తిడుల వల్ల పోలీసులకు ఎదురవుతున్న ఇబ్బందులేంటి? ఓటు బ్యాంకింగ్‌ కోసం కుల మతాలను రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటున్నారు? ప్రస్తుత ఓటర్ల ఆలోచనా విధానం ఎలా ఉంది? ఇలా ఆలోచింపజేపే పలు ఆసక్తికర అంశాలతో ఈ సినిమా నిండి ఉంటుంది. ఒకరకంగా ఈ సినిమా నేపథ్యం ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై ఓ వ్యంగ్యాస్త్రం. అలాగే ఓటు విలువ తెలియజెప్పే మంచి సందేశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇది తెరపైకి తీసుకురావడం దీనికి కలిసొచ్చే అంశం. ఇది రీమేక్‌ చిత్రమైనా.. దాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా చక్కగా మార్పులు చేశారు. (Kotabommali PS Review in telugu) ఈ కథను శ్రీకాకుళం నేపథ్యంలో సెటప్‌ చేయడం వల్ల దీనికొక సహజమైన అందం చేకూరింది. సినిమా ప్రారంభమైన కాసేపటికే కోటబొమ్మాళి ప్రపంచంలోకి వెళ్లిపోతారు ప్రేక్షకులు. ఓవైపు ఎన్నికల హడావుడి.. మరోవైపు అధికారిక పార్టీ ఒత్తిడులతో పోలీస్‌ వ్యవస్థ ఎదుర్కొనే ఇబ్బందుల్ని చూపిస్తూ మెల్లిగా అసలు కథ మొదలవుతుంది. హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణగా శ్రీకాంత్‌ పరిచయ సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి. కథ ముందుకెళ్లే కొద్దీ ఈ పాత్రలోని అసలు సిసలు హీరోయిజం బయటకొస్తుంది. ఓ పెళ్లి నుంచి తిరిగొస్తుండగా రామకృష్ణ, రవి, కుమారి ఉన్న పోలీస్‌ జీపు అదుపు తప్పి ప్రమాదానికి గురవ్వడం.. ఆ ప్రమాదంలో అధికారిక పార్టీకి అవసరమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చనిపోవడంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఈ ప్రమాదాన్ని అడ్డం పెట్టుకొని మున్నా టీమ్‌ తమ కుల ఓటర్లను రెచ్చగొట్టే తీరు.. వాళ్ల ఓట్ల కోసం హోంమంత్రి అన్యాయంగా రామకృష్ణను కేసులో ఇరికించాలని ప్రయత్నించడం.. కథ ఆసక్తికరంగా మారుతుంది. ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ద్వితీయార్ధంపై ఆసక్తిరేకెత్తించేలా ఉంటాయి.

ద్వితీయార్ధమంతా రామకృష్ణ - రజియా అలీకి మధ్య నడిచే మైండ్‌ గేమ్‌లా ఉంటుంది. రామకృష్ణను పట్టుకునేందుకు రజియా వేసే ఎత్తులు.. వాటిని తన తెలివితేటలతో అతను చిత్తు చేసే తీరు అలరిస్తాయి. మధ్యలో వచ్చే కొన్ని రొటీన్‌ ఎమోషనల్‌ సీన్స్‌ కాస్త బోర్‌ కొట్టించినా.. క్లైమాక్స్‌ వరకూ తర్వాత ఏం జరగనుందా అన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో కనిపిస్తుంటుంది. ప్రీక్లైమాక్స్‌లో రామకృష్ణ పాత్ర ముగింపు మదిని బరువెక్కిస్తుంది.(Kotabommali PS Review in telugu)  ఆ తర్వాత వచ్చే కోర్టు రూం డ్రామా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ ముగింపు మాతృకకు కాస్త భిన్నంగా ఉంటుంది. పతాక సన్నివేశాల్లో మన వ్యవస్థ గురించి.. ఓటర్ల ఆలోచనా విధానం గురించి మురళీ శర్మ చెప్పే డైలాగులు ఆలోచింపజేయిస్తాయి.

ఎవరెలా చేశారంటే: శ్రీకాంత్‌కు చాలా కాలం తర్వాత రామకృష్ణ రూపంలో మంచి నటన, హీరోయిజం పండించే పాత్ర దొరికింది. ఆరంభంలో ఈ పాత్ర ఓ సామాన్య కానిస్టేబుల్‌లా కనిపించినా.. అతని నేపథ్యం గురించి తెలిశాక అందులోని అసలు సిసలు హీరోయిజం బయటకొస్తుంది. ఈ పాత్రను శ్రీకాంత్‌ చాలా సెటిల్డ్‌గా చేసుకొచ్చారు. పతాక సన్నివేశాల్లో కూతురి ప్రేమ కోసం తాపత్రయ పడే తండ్రిగా ఆయన నటన కంటతడి పెట్టిస్తుంది. ఆయనకు సవాల్‌ విసిరే రజియా అలీ పాత్రలో వరలక్ష్మీ చక్కగా నటించింది. (Kotabommali PS Review in telugu) ఆ పాత్రలో ఆమె పలికించిన హవభావాలు, బాడీ లాంగ్వేజ్‌ కథపై ప్రేక్షకుల్లో ఓ ఆసక్తి కలిగించేలా చేస్తాయి. రాహుల్‌ విజయ్, శివానీ రాజశేఖర్‌ నాయకానాయికల్లా కాకుండా కథలో రెండు సహజమైన పాత్రల్లా కనిపిస్తారు. హోంమంత్రిగా మురళీశర్మ విలక్షణమైన నటన, డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకున్నారు. ప్రవీణ్, సీవీఎల్‌ నరసింహారావు, బెనర్జీ తదితరులు తమ పరిధిమేరకు నటించారు. తేజ మార్ని ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌ను చక్కగా డీల్‌ చేశారు. ఎక్కడా గీత దాటకుండా.. రాజకీయ వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపారు. ద్వితీయార్ధంలో చిన్న చిన్న లోపాలున్నా.. మొత్తంగా సినిమా ఆకట్టుకుంటుంది. మాతృక చూడని ప్రేక్షకులకు కచ్చితంగా ఓ కొత్త అనుభూతి అందిస్తుంది. ‘‘లింగిడి’’ పాటను కథలో సెట్‌ చేసిన తీరు బాగుంది. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం కథకు అదనపు ఆకర్షణ తీసుకొచ్చాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

  • బలాలు
  • + శ్రీకాంత్‌ నటన
  • + కథా నేపథ్యం.. ట్విస్టులు
  • + పతాక సన్నివేశాల్లో సందేశం
  • బలహీనతలు
  • - నెమ్మదిగా సాగే ద్వితీయార్ధం
  • చివరిగా: రాజకీయ వ్యవస్థను.. ఓటర్లను ప్రశ్నించే చిత్రమిది!(Kotabommali PS Review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని