Actress Hema: అప్పటివరకూ ‘మా’ నుంచి హేమ సస్పెండ్‌..: మంచు విష్ణు

Actress Hema: సినీ నటి హేమను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు.

Updated : 06 Jun 2024 16:05 IST

Actress Hema: (హైదరాబాద్‌): బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన సినీ నటి హేమను (Actress Hema) మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) సస్పెండ్‌ చేసింది. పోలీసుల నివేదికలో హేమ డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) తెలిపారు. హేమను సస్పెండ్‌ చేసే విషయమై బుధవారం ‘మా’ ప్యానెల్‌ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. అయితే, తుది నిర్ణయానికి రాలేదు. హేమను సస్పెండ్‌ చేస్తున్నట్లు గురువారం ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. ఈమేరకు ఆమెను సస్పెండ్‌ చేస్తున్నట్లు మా సభ్యులకు తెలిపారు. డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని హేమకు నోటీస్ ఇచ్చినా ఆమె స్పందించకపోవడంతో విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారు. హేమకు క్లీన్ చిట్ వచ్చేంతవరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని ‘మా’ సభ్యులకు తెలిపారు.

రేవ్‌ పార్టీ విషయంలో హేమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ మంచు విష్ణు ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయి. ఒక తల్లిగా, భార్యగా ఉన్న ఆమెపై లేని వదంతులు సృష్టించడం, వ్యక్తిగతంగా దూషించడం తగదు. నిర్ధారణ లేని, ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయడం మానుకోవాలి. హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించాలి. హేమకు సంబంధించిన కచ్చితమైన ఆధారాలను పోలీసులు అందిస్తే ‘మా’ అసోసియేషన్ తగిన చర్యలు తీసుకుంటుంది. అప్పటివరకు హేమపై నిరాధారమైన ఆరోపణలను సంచలనాల కోసం ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా’ అని పోస్ట్‌ చేశారు. రేవ్‌ పార్టీ కేసు విషయంలో హేమ స్పందించకపోవడంతో తాజాగా విష్ణు ఆమెను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇక రేవ్‌ పార్టీ కేసులోహేమను కోర్టులో హాజరుపరచగా, జూన్‌ 14 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులతో పాటు సినీ నటి హేమ కూడా విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసినా తనకు వైరల్‌ ఫీవర్‌ వచ్చిందని, విచారణకు హాజరుకాలేనని హేమ (Hema) బెంగళూరు పోలీసులకు లేఖ రాశారు. విచారణకు హాజరుకావడానికి ఇంకాస్త సమయం కావాలని కోరారు. అయితే, హేమ అభ్యర్థనను సీసీబీ పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. విచారణకు గైర్హాజరైన హేమకు మళ్లీ నోటీసులు పంపారు. ఎట్టకేలకు విచారణకు వచ్చిన ఆమెను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని