Alia Bhatt: తొలిసారి కుమార్తెను చూపించిన అలియా - రణ్‌బీర్‌.. వీడియో వైరల్‌

తమ కుమార్తె రాహా (Raha)ను కెమెరా ముందుకు తీసుకువచ్చారు అలియాభట్‌ (Alia Bhatt), రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) దంపతులు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Updated : 25 Dec 2023 18:31 IST

ముంబయి: తమ కుమార్తె రాహా(Raha)ను ఎట్టకేలకు కెమెరా ముందుకు తీసుకువచ్చారు బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), అలియాభట్‌ (Alia Bhatt). క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా తమ ఇంటి వద్దకు విచ్చేసిన విలేకర్లను ఈ జోడీ పలకరించింది. తమ కుమార్తెను పరిచయం చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రాహా క్యూట్‌గా ఉందంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Prabhas: అందుకే ‘సలార్‌’కు ఓకే చెప్పా.. పార్ట్‌ 2 మరింత అద్భుతంగా ఉంటుంది : ప్రభాస్‌

రణ్‌బీర్‌ - అలియా భట్‌ చాలా కాలం నుంచి స్నేహితులు. ‘బ్రహ్మాస్త్ర’ కోసం వీరిద్దరూ తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ఆ సినిమా షూట్‌లోనే ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో గతేడాది ఏప్రిల్‌ 14న వీరి వివాహం జరిగింది. నవంబర్‌లో పాప జన్మించింది. తమ పాపకు రాహా అనే పేరు పెట్టామంటూ అలియా గతంలో ఓ పోస్ట్‌ పెట్టారు. వివిధ భాషల్లో ఆ పేరుకు అర్థమేంటో తెలిపారు. రాహా అంటే దైవ మార్గమని, సంస్కృతంలో వంశమని, బెంగాలీలో విశ్రాంతి, సౌకర్యం, ఉపశమనం, అరబిక్‌లో శాంతి, సంతోషం, స్వేచ్ఛ అని చెప్పారు. రణ్‌బీర్‌ ఆ పేరును నిర్ణయించారని అలియా తెలిపారు. పాప రాకతో తమ జీవితం ఆనందంగా మారిందని పలు సందర్భాల్లో ఈ జంట పేర్కొంది. సినిమాల విషయానికి వస్తే.. ‘యానిమల్‌’తో  తాజాగా విజయాన్ని అందుకున్నారు రణ్‌బీర్‌ కపూర్‌. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 1న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మరోవైపు, అలియాభట్‌.. ‘రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’, ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’తో ప్రేక్షకులను అలరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని