Alia Bhatt: ఈ విజయం మీదే.. జాతీయ అవార్డుపై అలియా భట్‌ స్పందన..

తనకు జాతీయ అవార్డు రావడంపై అలియా భట్‌ (Alia Bhatt) సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ధన్యావాదాలు తెలిపారు.

Updated : 25 Aug 2023 13:53 IST

ముంబయి: బాలీవుడ్‌ హీరోయిన్ అలియా భట్‌కు (Alia Bhatt) ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ‘గంగూబాయి కాఠియావాడి’లో వేశ్య పాత్రకు గాను ఈ అవార్డు వరించింది. దీంతో ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక దీనిపై అలియా భట్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో నోట్ రాశారు.

‘‘దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీతో పాటు ‘గంగూబాయి కాఠియావాడి’ టీమ్‌కు కృతజ్ఞతలు. ముఖ్యంగా నన్నెంతగానో ఆదిరిస్తున్న ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ జాతీయ అవార్డు మీదే. ఎందుకంటే మీరు లేకుండా ఇది సాధ్యం కాదు. నాకెంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. మీకు వినోదాన్ని ఇవ్వడం కోసం నా శాయశక్తుల ప్రయత్నిస్తాను’’ అని రాసుకొచ్చారు. అలాగే మరోనటి కృతిసనన్‌ కూడా ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అలియా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘నేను మీమీ చిత్రాన్ని చూడగానే కృతిసనన్‌కు (kritisanon) మెసేజ్‌ చేశాను. ఆమె ఆ సినిమాలో ఎంతో శక్తిమంతమైన పాత్ర చేసింది. ఆ చిత్రం చూసి నేను ఎంతో సేపు ఏడ్చాను. కృతి సనన్‌ ఈ అవార్డుకు అర్హురాలు’ అని రాశారు. ఇక ఈ పోస్ట్‌కు అనుష్క శర్మ, దీపికా పదుకొణెతో పాటు పలువురు ప్రముఖులు కామెంట్‌ చేస్తున్నారు.

ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు..: ఆర్‌.మాధవన్‌

తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఆర్‌.మాధవన్‌ (R Madhavan) దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ (Rocketry: The Nambi Effect) ఎంపికైంది. ఇస్రో సీనియర్‌ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ఆర్‌. మాధవన్‌ ప్రధాన పాత్రలో నటించారు. ఇది దర్శకుడిగా ఆయనకు తొలి చిత్రం కావడం విశేషం. అంతేకాకుండా ఈ అవార్డును తన తల్లి పుట్టినరోజు ప్రకటించడంతో రెట్టింపు ఆనందాన్ని పొందుతున్నారు మాధవన్‌.  ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్‌ చేశారు. ‘‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ చిత్రాన్ని ఎంపిక చేసిన అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రబృందానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇది మాటలకు అందని అనుభూతి’’ అంటూ తన తల్లితో దిగిన ఫొటోను షేర్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని