Allu Aravind: అతడు మా కుటుంబంలో ఎవరికీ పీఆర్‌వో కాదు: అల్లు అరవింద్‌

ఇటీవల గోవా వేదికగా జరిగిన ఓ అవార్డుల కార్యక్రమం ప్రస్తుతం చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పలువురు కన్నడ నటీనటులు తెలుగు చిత్ర పరిశ్రమను తప్పుబట్టడంపై నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) స్పందించారు.

Updated : 04 Dec 2023 20:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి గోవా వేదికగా డిసెంబర్‌ 2న అవార్డుల కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటుల సమక్షంలో ఇది జరిగింది. అయితే, ఈ వేడుకలో తమని అవమానించారంటూ కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు అసహనం వ్యక్తం చేశారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని, కన్నడ నటీనటులను అవమానించేలా వ్యవహరించారని పేర్కొంటూ నెట్టింట పోస్టులు పెట్టారు. తెలుగు చిత్ర పరిశ్రమను తప్పుబడుతూ వాళ్లు చేసిన వ్యాఖ్యలు స్థానిక పత్రికల్లో వైరల్‌గా మారాయి. దీనిపై నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) తాజాగా మీడియాతో మాట్లాడారు.

ఈవారం థియేటర్‌/ఓటీటీల్లో.. అలరించే సినిమాలు, సిరీస్‌లివే

‘‘అవార్డుల వేడుకలో ఇతర భాషల వారికి ఇబ్బందులు జరిగాయి. తెలుగు చిత్ర పరిశ్రమను వాళ్లు తప్పుబడుతున్నారు. ఈ మేరకు పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. వాటిని చూసి నేను ఎంతో బాధపడ్డా. అది పూర్తిగా ఒక వ్యక్తికి సంబంధించిన విషయం. ఒక వ్యక్తి చేసిన పనిని వేరే వాళ్లకు, ఇండస్ట్రీకి ఆపాదించడం కరెక్ట్ కాదు. అతడు మా కుటుంబంలో ఎవరికీ పీఆర్‌వో కాదు. అది అతని పర్సనల్ ఫెయిల్యూర్‌’’ అని తెలిపారు. నిర్వాహకుడు సైతం దీనిపై స్పందించాడు. నటీనటులకు క్షమాపణలు చెప్పాడు. సమాచారలోపంతో ఇబ్బందులు తలెత్తాయని, వేరే పరిశ్రమ వాళ్లను తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని