Allu Aravind: అప్పుడు లావణ్య త్రిపాఠి.. ఇప్పుడు మృణాల్‌కు అల్లు అరవింద్‌ బ్లెస్సింగ్స్‌

టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులు ఓకే చేస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు నటి మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur). ఆమెను ఉద్దేశించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) ఇటీవల చేసిన పలు వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Updated : 30 Oct 2023 15:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) చక్కగా తెలుగు మాట్లాడుతుందని, కాబట్టి ఇక్కడి అబ్బాయినే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని గతంలో అల్లు అరవింద్‌ (Allu Aravind) ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ మాటలే నిజమై.. త్వరలో ఆమె నటుడు వరుణ్‌తేజ్‌(Varun tej)తో పెళ్లి పీటలెక్కనున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా అల్లు అరవింద్‌ మరోసారి నటి మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur)పై సైతం ఇదే విధమైన కామెంట్స్‌ చేశారు. మృణాల్‌ కూడా తెలుగింటికి కోడలిగా రావాలనే ఉద్దేశం వచ్చేలా ఆయన మాట్లాడారు. ‘సైమా 2023’ (SIIMA 2023) వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?

సైమా 2023 అవార్డుల ప్రదానోత్సవం సెప్టెంబర్‌లో దుబాయ్‌ వేదికగా జరిగింది. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు తాజాగా బయటకు వచ్చాయి.  ఉత్తమ నటి (క్రిటిక్స్‌) విభాగంలో ‘సీతారామం’ చిత్రానికి గానూ మృణాల్‌ అవార్డు గెలుపొందారు. అల్లు అరవింద్‌ ఆమెకు అవార్డు అందించారు. ఈ సందర్భంగా మృణాల్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ఉత్తమ నటిగా నేను అందుకున్న తొలి అవార్డు ఇదే. ఆనందంతో  మాటలు రావడం లేదు. ‘సీతారామం’ టీమ్‌ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. సీత పాత్రకు నేను సరిపోతానని వాళ్లు బాగా నమ్మారు. అచ్చ తెలుగింటి అమ్మాయిలా నన్ను తీర్చిదిద్దారు. ఈ సినిమా షూట్‌ మొదలైన నాటి నుంచి హైదరాబాద్‌ని మా ఇంటిలా ఫీలయ్యా. ముంబయికి వెళ్లాలనిపించేది కాదు.  ముంబయి నిర్మాతలు చాలా మంది.. ‘మీరు హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయ్యారా?’ అని అడిగేవారు. నాకు మాత్రం హైదరాబాద్‌కు వచ్చేయాలని ఉంది’’ అని ఆమె అన్నారు.

upcoming telugu movies: ఈ వారం సినిమాలు నవ్విస్తాయ్‌.. భయపెడతాయ్‌..!

అనంతరం అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘గతంలో నేనొక ఈవెంట్‌లో హైదరాబాద్‌ అబ్బాయిని పెళ్లి చేసుకుని తెలుగింటికి కోడలిగా రమ్మని ఓ హీరోయిన్‌కి బ్లెస్సింగ్స్‌ ఇచ్చా. తెలుగు హీరోతో ఆమె ప్రేమలో పడింది. త్వరలో పెళ్లి చేసుకోనుంది. ఇప్పుడు నిన్ను కూడా బ్లెస్‌ చేస్తున్నా. నువ్వు కూడా ఇక్కడికి తిరిగి వచ్చేయాలని కోరుకుంటున్నా’’ అని నవ్వుతూ చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని